ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి అరెస్టయ్యారు. కొద్దిరోజుల క్రితమే విజయవాడలో ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించిన చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసి వ్యాన్ లో పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తతలు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తర్వాత మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ గేటు వద్ద వారంతా నిరసన తెలిపారు. దీనికి చంద్రబాబు కూడా మద్దతు పలికారు.


 అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు జగన్ కాన్వాయ్ ముందు బైఠాయించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ తరువాత రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు చంద్రబాబు ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్రగా అసెంబ్లీ నుంచి మండలం గ్రామం వైపు బయలుదేరారు. అయితే వీరు బయలుదేరిన కొద్ది సేపటికి పోలీసులు వారిని అడ్డుకున్నారు. చంద్రబాబు పాదయాత్ర కు అనుమతి లేదని, అలాగే మందడం గ్రామంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ ౩౦ అమల్లో ఉందని పోలీసులు వారికి అడ్డు చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరిస్థితులు మరింత ఉదృతంగా మారే సూచనలు కనిపించడంతో ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. 


అందరిని పోలీసు వాహనంలో ఎక్కించి చంద్రబాబు నివాసం వద్ద విడిచి పెట్టే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీలో మూడు రాజధానుల  బిల్లు పాస్ అవడంతో తెలుగుదేశం పార్టీలో  ఎక్కడలేని ఆందోళన కనిపిస్తోంది. మరో రెండు రోజులు శాసనసభ వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుండడంతో ఈ రెండు రోజులు అధికార, విపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక చంద్రబాబు ని అరెస్ట్ చేశారన్న వార్త తెలియడంతో తెలుగు తమ్ముళ్లలో ఆందోళన మొదలయ్యింది. ఎంతో వెలుగు వెలిగిన చంద్రబాబు ఇప్పుడు ఇలా డొక్కు వ్యానులో ధీనంగా కూర్చున్నారు అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: