కరోనా వైరస్ భయపెడుతోంది. చైనాలో ఇప్పటికే 170మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో చదువులు, ఉద్యోగాల కోసం చైనా వెళ్లిన తెలుగు వారి పరిస్థితి ఏంటి..? వెనక్కు రావటానికి ప్లైట్లు లేవు. అక్కడే ఉండే ధైర్యం లేదుఎవరికైనా వ్యాధి సోకిందేమోననే భయంతో జంకుతున్నాయి ట్రావెల్ ఏజెన్సీలు. ఈ తరుణంలో భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. 

 

ఎంఎస్, ఎంటెక్, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువుల కోసం వేలాది మంది తెలుగు విద్యార్థులు చైనాలోని వివిధ యూనివర్సిటీల్లో చేరారు. ఉద్యోగాల కోసం చైనాలోని వూహాన్, బీజింగ్, నాన్జింగ్, షాంగైతోపాటు పలు నగరాల్లో వందలాది మంది భారతీయులున్నారు. వీరంతా కరోనాతో కంగారెత్తుతున్నారు. ఈ వైరస్ ఎక్కడ తమను బలిగొంటుందో అని బిక్కుబిక్కుమంటున్నారు తెలుగువారు.


ఎంబీబీఎస్ తోపాటు ఇతర వైద్య కోర్సుల నిమిత్తం అపెక్స్ కన్సల్టెన్సీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 2016-2018 మధ్య ఏటా వెయ్యి నుంచి 15 వందల మంది వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. 2019-20 లో 280 మంది వరకు వెళ్లారు. బీజింగ్, షాంగై, నాన్జింగ్ నగరాల్లో 1380 మంది భారతీయ విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్నారు. అందులో 30 మంది వైజాగ్కి చెందినవారే. 

 

ప్రస్తుతం కరోనా వ్యాపించిన వూహాన్‌ లోనే తెలుగు విద్యార్థులు వందలాది మంది ఉన్నారు. వైరస్ ప్రభావంతో బిక్కుబిక్కుమంటూ హాస్టళ్లు, అద్దె గదులకే పరిమితమవుతున్నారు. కూరగాయలు, మందుల కోసం తప్పని పరిస్థితుల్లో మాస్క్ లతో బయటికి వస్తున్నారు. 

 

చైనా దాటి స్వదేశాలకు వెళ్లిపోదామన్నా వెళ్లడానికి వీలు లేని దుస్థితి. ఫ్లైట్స్, ట్రైన్స్, బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వద్దామనుకున్నా... ఏమాత్రం జలుబు, దగ్గు ఉన్నా.. అనుమతించడం లేదు. దీంతో చైనాలో చిక్కుకుపోయిన భారతీయులందరినీ ఇండియా తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ సిద్ధమైంది. ఒక్క వూహాన్‌ లోనే మనవాళ్లు 250 నుంచి 300 మంది ఉన్నారు. బీజింగ్‌ లోని భారతీయ రాయబార కార్యాలయం ఈ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల్లో వెళ్లాలనుకునే వాళ్లు భారత్ చేరుకున్నాక.. 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని భారత రాయభార కార్యాలయం సూచించింది. 

 

స్వదేశానికి రావాలనుకునే భారతీయులు తమ పాస్పోర్ట్ నెంబర్, పేరు వంటి వివరాలను అందజేయాలని సూచించింది. వూహాన్లో ఉన్న భారతీయులెవరూ.. వైరస్ భారిన పడలేదని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని సూచించింది. భారతీయుల తరలింపు కోసం 423 సీట్ల బోయింగ్ 747-400 విమానాన్ని సిద్ధంగా ఉంచింది ఎయిరిండియా. ఈ బోయింగ్ వూహాన్ వెళ్లడానికి పచ్చజెండా ఊపింది డీజీసీఏ. అదేసమయంలో చైనా నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులను పరీక్షించేందుకు 20 విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: