దశాబ్దాలు గడుస్తున్నా... నేతాజీ సుభాష్ చంద్రబోష్‌ అదృశ్యంపై వివాదం కొనసాగుతూనే ఉంది. గుమ్నామీ బాబాయే నేతాజీ అన్న వాదనలో నిజం లేదని ఇటీవల తేల్చి చెప్పింది యూపీ ప్రభుత్వం వేసిన జస్టిస్‌ విష్ణు సహాయ్‌ కమిషన్‌. కానీ... ఆ నివేదిక తప్పుల తడకంటున్నారు నేతాజీ అభిమానులు. 

 

1945 ఆగస్టులో తైవాన్‌లో విమానం కూలిపోయిన ఘటనలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చనిపోయారని యావత్‌ ప్రపంచం నమ్ముతోంది. కానీ... నేతాజీ అభిమానులు మాత్రం అందులో నిజం లేదంటున్నారు. విమాన ప్రమాదంలో ఆయన చనిపోలేదని.. ఏదో ఒక రోజు భారత్‌కు వచ్చి ఉంటారన్నది వాళ్ల నమ్మకం. ఈ క్రమంలోనే యూపీ ఫైజాబాద్‌లో రహస్య జీవితం గడిపిన గుమ్నామీ బాబాయే నేతాజీ అనే వాదనను కొందరు బలంగా వినిపిస్తూ వచ్చారు. 1985 సెప్టెంబర్‌ 16న గుమ్నామీ బాబా చనిపోయారు. 

 

గుమ్నామీ బాబాకు నేతాజీ పోలికలు ఉన్నాయని... ఆయనే ఈయనంటూ ప్రచారం జరిగింది. గుమ్నామీ బాబా చెందిన ఓ బాక్సును 2016లో  తెరిచారు అధికారులు. అందులో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ విడుదల చేసిన ఓ బ్రోచర్‌ ఉంది. అలాగే, బ్రిటన్‌లో తయారైన ఎంపైర్‌ కరోనా క్లాసిక్‌ పోర్టబుల్‌ టైప్‌ రైటర్‌, వింటేజ్‌ పోర్సిలన్‌ టీ-సెట్‌ ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఫొటోగ్రాఫ్‌తో పాటు నేతాజీ తల్లిదండ్రులు జానకీనాథ్‌ బోస్‌, ప్రభావతి బోస్‌ల ఫొటో కూడా ఉంది. 

 

నేతాజీ అదృశ్యంపై నిజాలేంటో నిగ్గు తేల్చేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం జస్టిస్‌ విష్ణు సహాయ్‌ కమిషన్‌ని నియమించింది. ఈ కమిషన్‌ ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభకు తన నివేదికను సమర్పించింది. సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబోరేటరీ-సీఎఫ్ఎస్ఎల్  అందించిన ఎలక్ట్రోఫీరోగ్రామ్‌ రిపోర్టు ఆధారంగానే బాబాయే నేతాజీ కాదన్న నిర్ధారణకు వచ్చినట్టు నివేదికలో ఉంది. దీనిపై సాయక్‌ సేన్‌ అనే నేతాజీ అభిమాని ఎలక్ట్రోఫీరోగ్రామ్‌ నివేదిక ఇవ్వాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన కోల్‌కతా సీఎఫ్ఎస్ఎల్... తమ వద్ద ఆ నివేదిక లేదని చెప్పింది. ఆ నివేదిక కావాలంటే సీఎఫ్ఎస్ఎల్  డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.  

 

బాబా వాడిన వస్తువులు, బాబా దంతంపై కోల్‌కతాకు చెందిన సీఎఫ్ఎస్ఎల్ చేపట్టిన ఎలక్ట్రోఫీరోగ్రామ్‌ నివేదిక ఆధారంగా నేతాజీ, బాబా ఒకరు కాదని తేల్చారు. కానీ, ఇప్పుడు అలాంటి నివేదిక తమ వద్ద లేదని కోల్‌కతా సీఎఫ్ఎస్ఎల్ చెప్పడం చర్చనీయాంశమైంది. 2005 నాటి ముఖర్జీ కమిషన్‌ రిపోర్టు ఆధారంగానే విష్ణు సహాయ్‌ కమిషన్‌ నివేదిక సమర్పించిందని ఆరోపిస్తున్నారు నేతాజీ అభిమాని సాయక్‌ సేన్‌. ముఖర్జీ కమిషన్‌ రిపోర్టులో ఎలక్ట్రోఫీరోగ్రామ్‌ లేదని... ఇది డీఎన్‌ఏ పరిశీలనకు తప్పనిసరి అంటున్నారాయన. ఆ రిపోర్టును కావాలనే ప్రభావితం చేశారని.. దాని ఆధారంగా తాజాగా సహాయ్‌ కమిషన్‌ కూడా నివేదిక ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందన్నారు.  మరోవైపు... సాయక్‌ సేన్‌ ఆరోపణల్లో నిజం లేదంటున్నారు నేతాజీ మనవడు, బెంగాల్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్‌ బోస్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: