తెలుగు సినిమా క్రమంగా మహిళా ప్రాధాన్య కథలకు మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు కథకు పరిమితమైనప్పటికీ, ఇప్పుడు కథానాయికలే కథను తమ భుజాలపై మోసే స్థాయిలో సినిమాలు రూపొందుతున్నాయి. అనుష్క, సమంత, రష్మిక మందన్న, నివేదా థామస్ వంటి నటీమణులు తమదైన నటనతో ఈ మార్పులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే పరిణామంలో మరో అడుగు ముందుకు వేస్తూ *కామాక్షి భాస్కర్ల ‘అగధ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.*

ఆగస్టు 14న విడుదల కానున్న ‘అగధ’లో కామాక్షి భాస్కర్ల మహాదేవి అనే పాత్రలో ప్రధాన పాత్రను పోషించారు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే టీజర్, ట్రైలర్ ద్వారా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు కామాక్షి చేసిన పాత్రలతో పోలిస్తే మహాదేవి పాత్ర పూర్తిగా భిన్నమైనదిగా కనిపిస్తోంది. నటనకు ప్రాధాన్యమున్న సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆమె కనిపించనుండటం ఈ పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

తెలుగు సినిమాలో మహిళా ప్రధాన కథలకు ఉన్న ఆదరణను పరిశీలిస్తే ఈ మార్పు కేవలం ఒక ట్రెండ్‌గా కాకుండా ప్రేక్షకుల అభిరుచిలో వస్తున్న పరిణామంగా కనిపిస్తోంది. సమంత ఇప్పటికే ‘మా ఇంటి బంగారం’తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. రష్మిక మందన్న కూడా స్టార్ హీరోలతో కలిసి నటిస్తూనే ‘ది గర్ల్‌ఫ్రెండ్’, మైసా వంటి కథానాయిక ప్రాధాన్య చిత్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తోంది. నివేదా థామస్ ‘35’ వంటి చిత్రాలతో నటనకు ప్రాధాన్యమున్న మహిళా ప్రధాన కథల్లో తనదైన ముద్ర వేశారు. అనుష్క శెట్టి అయితే ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాలతో తెలుగు సినిమాలో మహిళా ప్రధాన చిత్రాలకు ఒక ప్రత్యేకమైన స్థాయిని తీసుకొచ్చారు.

ఇలాంటి నేపథ్యంలో ‘అగధ’ కామాక్షి భాస్కర్ల కెరీర్‌లో కూడా కీలకమైన అడుగుగా నిలవనుందనే ఆసక్తి నెలకొంది.‘పొలిమేర’ చిత్రాలతో నటిగా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కామాక్షి, ఇప్పుడు ‘అగధ’లో పూర్తిగా భిన్నమైన మహాదేవి పాత్రతో తనలోని మరో కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

కేవలం ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, నటిగా విభిన్నమైన భావోద్వేగ ప్రపంచాలను అన్వేషించాలనే ఆసక్తి కామాక్షిలో కనిపిస్తోంది. ‘అగధ’లోని మహాదేవి పాత్ర కూడా తన ప్రయాణంలో మరో ముఖ్యమైన మెట్టుగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ‘అగధ’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న నేప‌థ్యంలో ఒక మహిళా ప్రధాన కథను తన భుజాలపై మోస్తూ కామాక్షి భాస్కర్ల మహాదేవిగా ఏ స్థాయిలో మెప్పించనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కామాక్షి భాస్కర్ల కెరీర్‌లో ‘అగధ’ ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా? మహిళా ప్రధాన చిత్రాల విజయ పరంపరలో మరో విజయాన్ని నమోదు చేస్తుందా? తెలుసుకోవాలంటే ఆగస్టు 14 వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: