ఈరోజున ప్రారంభమైన బడ్జెట్ రెండో దశ పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 3 వరకు కొనసాగనున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటన చేస్తుండగా ఢిల్లీలో అల్లర్లు జరిగి 46 మంది చనిపోగా... 150 మందికి పైగా గాయాలపాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఈ రోజు పార్లమెంటు సమావేశంలో ఢిల్లీ అల్లర్ల గురించి మాట్లాడుతూ ప్రకంపనలు సృష్టించారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని రాజీనామా చేయాలని విపక్షాలు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశాయి.



దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు లోక్ సభ స్పీకర్ మాట్లాడుతూ ఢిల్లీ హింసాత్మక అల్లర్ల గురించి మాట్లాడడం ఇప్పుడు సరైనది కాదని చెబుతూ ప్రతిపక్ష నేతల మైకులని కట్టేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ నేతలు ట్రెజరీ బెంచుల వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తిన ఓం బిర్లా సమావేశాన్ని వాయిదా వేశారు. ఇలా ఈ రోజు మూడు సార్లు వాయిదా వేసి రేపటికి అనగా మంగళవారం రోజు కి సమావేశాలు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా కాంగ్రెసు బీఎస్పి డీఎంకే, టీఎంసీ నేతలు గట్టిగా నినాదాలు చేయడంతో ఛైర్మన్ వెంకయ్య నాయుడు సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు.





విపక్ష నాయకులు ముందుగానే లోక్ సభలో రాజ్యసభలో ఢిల్లీ అల్లర్లపై చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే లోక్ సభలో ప్రధాని పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని పోస్టర్లని చూపిస్తూ నినాదాలు చేయడంతో నేటి సమావేశాలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. అలాగే కాంగ్రెస్ నేతలు సభలో పేపర్లను చించి గాలిలో విసిరే సరికి బిజెపి నేతలు కాంగ్రెస్ నేతలు వైపు వెళ్లారు. దీంతో ఇరుపార్టీల మధ్య స్వల్ప ఘర్షణలు చోటు చేసుకునే సరికి సమావేశం వాయిదా వేయాల్సి వచ్చింది.




రాజ్యసభలో అపోజిషన్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ఢిల్లీలో మూడు రోజులపాటు అల్లర్లు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం నిద్ర పోతుందా? అని ఘాటుగా ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెసు పార్టీ నేతలు నినాదాలు చేస్తూ నరేంద్ర మోడీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇకపోతే చైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 'మనం తప్పకుండా ఢిల్లీ అల్లర్ల గురించి మాట్లాడుకుందాం. కానీ దేశంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పుడు సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించి ఇటువంటి అల్లర్లు పునరావృతం కాకుండా చర్చిద్దాం'అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: