పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రానుండటంతో...ఎస్‌ బ్యాంకుపై ఎల్లుండి మారటోరియం తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్బీఐ నియమిత అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్‌ కుమార్‌  సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు బ్యాంక్‌ రాణా కపూర్‌ మనీ ల్యాండరింగ్‌ కేసు దర్యాప్తు అనిల్‌ అంబానీ మెడకు చుట్టుకుంటోంది.

 

ఎస్ బ్యాంక్ పునరుద్దరణ చర్యలు చక చకా జరిగిపోతున్నాయి. ఆర్బీఐ పునరుద్ధరణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదించడంతో...తదుపరి చర్యలు వేగంగా పూర్తవుతున్నాయి. ఈ నెల 18 నుంచి తాత్కాలిక నిషేధం రద్దు కానుంది. దీంతో ఎస్ బ్యాంకు ఖాతాదారులు 50వేలకు మించి నగదు ఉపసంహరించుకునే వెసులుబాటు కలుగనుంది.

 

ప్రస్తుతం ఆర్బీఐ నియమిత అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రశాంత్‌ కుమార్‌ సీఈవోగా.. ఆతర్వాత ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. మార్చి 13 నుంచి యస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణ స్కీమ్‌ 2020ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ప్రభుత్వం ఈ అంశాలు పొందుపర్చింది. ఏప్రిల్ 3 వరకు విత్ డ్రాయల్స్ పై పరిమితిని విధిస్తూ గతంలో ఆర్బీఐ మారటోయం విధించగా...అంతకు ముందే చర్యలను చేపట్టింది. పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. యస్‌ బ్యాంక్‌లో 49 శాతం దాకా వాటాలు తీసుకునే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  వచ్చే మూడేళ్లలో తన వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోవడానికి వీల్లేదు.

 

మరోవైపు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఝలక్ ఇచ్చింది. యస్ బ్యాంక్  మనీ ల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది.  బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో రుణాలు పొందిన పలు సంస్థల్లో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాయి. అంటే రుణాలు మొండి బకాయిలుగా మారిపోయాయి. దీంతో ఈడీ  అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. అయితే అనిల్ అంబానీ మాత్రం ఆరోగ్య కారణాలరీత్యా మినహాయింపు ఇవ్వాలని కోరారు. అందువల్ల ఈడీ ఈయనకు మళ్లీ ఎప్పుడు హాజరు కావాలో కొత్త తేదీని ప్రకటించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: