సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు వాహనాలను అనుమతించటం లేదు. ప్రభుత్వం ఇతర వాహనాలకు అనుమతి లేదని చెప్పడంతో బోర్డర్ దగ్గర పోలీసులు వాహనాలను అనుమతించే ప్రసక్తి లేదని చెబుతున్నారు. వాహనాలను ఆపివేయడంతో వాహనదారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. 
 
తెలంగాణలో చెక్ పోస్టుల దగ్గర వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను ఆపివేస్తున్న పరిస్థితి నెలకొంది. వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోజన ఏర్పాట్లు చేశారని సమాచారం. రాష్ట్రంలోకి అత్యవసర సర్వీసులకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తామని... ఇతర వాహనాలు అనుమతించబోమని పొలీసులు స్పష్టం చేశారు. 
 
వాహనాలను నిలిపివేయడంతో పోలీసులు, వాహనదారులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పోలీసులు లారీలు, డీసీఎంలకు పార్కింగ్ ఏర్పాటు చేసి నిలిపివేశారు. రవాణా శాఖ అధికారులు వాహనదారులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో భోజన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. 
 
మరోవైపు ఏపీలో పోలీసులు వాహనాలను నిలిపివేయడంతో కంచికచర్ల మండలం దొనకొండ చెక్ పోస్ట్ దగ్గర గందరగోళం నెలకొంది. పోలీసులు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు కొన్ని వాహనాలను అనుమతించారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకు కరోనా పాటిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటన చేశాయి. ఈ నెల 31 వరకు అంతర్రాష్ట్ర సర్వీసులను ఇరు రాష్ట్రాలు అనుమతించడం లేదు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని...  ముఖ్యమైన పనులు ఉంటే మాత్రమే  ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు సూచించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: