శ్రీమంతులకు కేరాఫ్ అడ్రస్ న్యూయార్క్. ప్రపంచ వాణిజ్య రాజధాని కూడా అదే. అలాంటి సిటీ ఇప్పుడు కరోనా ధాటికి చిగురుటాకులా వణికిపోతోంది. అమెరికాలో కరోనాకు కేంద్రస్థానంగా మారింది న్యూయార్క్. 

 

అమెరికా ఫైనాన్షియల్ క్యాపిటల్ గా పేరున్న న్యూయార్క్ ఇప్పుడు కరోనా క్యాపిటల్ గా మారిపోయింది. లక్షకు పైగా కేసులు ఇక్కడ నమోదు కాగా.. వేల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఇక్కడ ప్రతి రెండున్నర నిమిషాలలకూ ఓ మరణం నమోదవుతోంది. బుల్లెట్ ట్రైన్ స్పీడ్‌తో కోవిడ్ విజృంభిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో న్యూయార్క్‌లో పరిస్థితి చేజారిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. కోవిడ్ కట్టడి కోసం న్యూయార్క్ నగరాన్ని ఇప్పటికే లాక్‌డౌన్ చేశారు. న్యూయార్క్ రాష్ట్రంలో కూడా హెల్త్ ఎమర్జెన్సీ విధించడంతో పాటు.. పౌరుల రాకపోకలపై కఠినమైన ఆంక్షలు విధించారు. న్యూయార్క్‌కు వెళ్లి వచ్చిన వారు, ఆ నగరం నుంచి వెళ్తున్నవారు 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని అమెరికా ప్రభుత్వం సూచించింది. 

 

కరోనా ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా మళ్లుతోంది. దీంతో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు, నిరుద్యోగులు అవుతున్న కోట్లాది మందిని ఆదుకోవడం కోసం 2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. చిరు వ్యాపారులను ఆదుకోవడం కోసం 367 బిలియన్ డాలర్ల రుణ కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. పరిశ్రమలు, నగరాలు, రాష్ట్రాల కోసం 500 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేస్తోంది. ఒక్కో వ్యక్తికి 1200 డాలర్లు, పిల్లలకు 500 డాలర్ల చొప్పున అందిస్తారు. వ్యాపారవేత్తలతోపాటు కార్మికులు, వైద్యులకు కూడా భారీ మొత్తంలో ఆర్థిక సాయం అందనుంది.

 

ప్రభుత్వ సాయంలో కూడా సింహభాగం న్యూయార్క్ నగరానికి వచ్చే అవకాశం ఉంది. అసలు కరోనా తగ్గాక కూడా న్యూయార్క్ కు పూర్వవైభవం వస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. నంబర్ వన్ సిటీగా ఓ వెలుగు వెలిగిన తమ నగరం.. తమ కళ్ల ముందే స్మశాన నిశ్శబ్దంలోకి జారుకుంటుందని న్యూయార్క్ పౌరులు కల్లో కూడా ఊహించలేదు. కానీ విధి న్యూయార్క్ నగరంపై పగ బట్టింది. ఎప్పుడూ సందడిగా ఉంటూ.. రోజుకు 24 గంటల టైమ్ సరిపోనంత పనిచేసే నగరం.. ఇప్పుడు మౌనంగా రోదిస్తోంది.

 

కరోనా వైరస్‌ను సాధారణ ఫ్లూ లా భావించిన డొనాల్డ్ ట్రంప్.. అదే తగ్గిపోతుందని తొలుత భావించారు. ప్రజలకు అవగాహన కల్పించడం మీద ఆయన శ్రద్ధ పెట్టలేదు. జూలై, ఆగష్టు నెలల్లో అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుందని ఆయన భావించారు. కరోనా విషయంలో తగిన రీతిలో స్పందించడంలో ట్రంప్ సర్కారు విఫలమైందనే భావన వ్యక్తం అవుతోంది. కరోనా పెద్ద సమస్యే కాదని తొలుత ఆయన భావించారు. అత్యవసర ఆరోగ్య సేవలు, పరిశోధనలకు నిధులను తగ్గించారు. కరోనాను ఎదుర్కోవడానికి అమెరికా తగిన రీతిలో సన్నద్ధం కాలేదు. అమెరికాకు కరోనా ముప్పు పొంచి ఉందని హెచ్చరించిన వాళ్లను ఓవరాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. న్యూయార్క్ గవర్నర్ అరచిగీపెట్టినా ట్రంప్ స్పందించకపోవడం వల్ల కూడా న్యూయార్క్ ప్రధాన బాధితురాలిగా మారిందనే వాదన ఉంది. 


 
న్యూయార్క్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. గత 24 గంటల్లో 630 మంది మరణించారు. వచ్చే వారం రోజుల్లో పరిస్థితి మరింత భయానక రూపం దాల్చవచ్చని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆండ్రూ కుమోవో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నెల 2, 3వ తేదీల మధ్య 24 గంటల్లో 562 మంది చనిపోగా.. ఈ వైరస్‌ వల్ల ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 630 మంది చనిపోయారు. ఇంతవరకు ఈ వ్యాధికి ఈ రాష్ట్రంలో 3,565కి చేరాయి. దేశం మొత్తంలో పాజిటివ్‌ కేసులు 3.12 లక్షలకుపైనే ఉండగా.. ఒక్క న్యూయార్క్‌లోనే 1,13,704 కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్‌ రాష్ట్రంలో కూడా న్యూయార్క్‌ నగరంలోనే అత్యధిక కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

 

ఆరోగ్య సిబ్బందికి అత్యవసర రక్షణ పరికరాలైన మాస్కులు, గౌన్లు, వెంటిలేటర్లు, పీపీఈలు లేవని.. ఈ కారణంగానే వైరస్‌ కేసులు రానురాను పెరుగుతున్నాయని గవర్నర్‌ చెప్పారు. 17 వేల వెంటిలేటర్లకు ఆర్డర్‌ ఇస్తే ఫెడరల్‌ ప్రభుత్వం వద్ద అంత స్టాకు లేదని తెలిపారు. చైనా వెయ్యి వెంటిలేటర్లు పంపుతానని హామీ ఇచ్చిందన్నారు.తన తమ్ముడు, సీఎన్‍ఎన్‍ టీవీ న్యూస్‍ యాంకర్‍ క్రిస్‍ క్యూమో మహమ్మారి కరోనా బారిన పడ్డారని న్యూయార్క్ గవర్నర్‍ ఆండ్రూ క్యూమో తెలిపారు. ప్రాణాంతక వైరస్‍ ఎవరికైనా సోకుతుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విటర్‍లో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. నా చిట్టి తమ్ముడిని రక్షించుకోలేకపోతున్నా. తనను తాను కూడా కాపాడుకోలేడు. ఇది చాలా భయంకరంగా ఉంది. తన పరిస్థితి గురించి ఆందోళనగా ఉంది. మనం ప్రేమించే వాళ్లకు  ఇలా జరిగితే అందరం ఇలాగే విచారిస్తాం కదా. తమ్ముడు ఐ లవ్‍ యూ. ధైర్యంగా ఉండు అని ఆండ్రూ ఉద్వేగభరిత ట్వీట్‍ చేశారు.

 

గత మూడు రోజుల్లో కరోనా వైరస్‌తో న్యూయార్క్‌ రాష్ట్రంలో మృతుల సంఖ్య రెట్టింపైంది. అమెరికాలో న్యూయార్క్‌ నగరం ఈ వైరస్‌కు హాట్‌స్పాట్‌గా వుంది. ఈ వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, 14 రోజుల పాటు వైరస్‌ లక్షణాలు బయటపడనందున, బయటపడేలోపు ఇతరులకు వ్యాప్తి చేసే పరిస్థితులు వున్నందున దీని నివారణకు అతివేగంగా చర్యలు తీసుకోవాలని జనవరిలోనే ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కేవలం పరీక్షలు చేయడమే దీనికి మార్గమని చెప్పినా ట్రంప్‌ పట్టించుకోలేదు. దాంతో అమెరికాలో పరిస్థితి ముదిరి ఇప్పుడీ స్థితికి చేరుకుంది. న్యూయార్క్‌లో వెంటిలేటర్ల సమస్య వుందని దీనికి కారణం గవర్నర్‌, నగర మేయర్‌ అని ట్రంప్‌ నిందించారు. వందల సంఖ్యలో మరణాలు సంభవించడంతో న్యూయార్క్‌లో శ్మశాన వాటికల్లో కూడా ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. దీంతో రద్దీ తగ్గిన తర్వాత అంత్యక్రియలు చేపట్టేందుకు వీలుగా రసాయనాల సాయంతో కొన్ని మృతదేహాలను ఆస్పత్రుల్లోనే వుంచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో నాల్గో వంతు అమెరికాలోనే వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: