పౌల్ట్రీ రంగంలో తెలుగు రాష్ట్రాలే టాప్. కరోనా ప్రభావం.. అన్నింటికంటే ముందు ఈ రంగంపైనే పడింది. మొదట సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రభావం.. పౌల్ట్రీపై పడి ధరలు పడిపోయాయి. ఇప్పుడు లాక్ డౌన్ తో పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతింటోంది. 

 

దేశంలోనే పౌల్ట్రీ రంగానికి పెట్టింది పేరు తెలంగాణ. రాష్ట్రంలో 2 వేల మంది లేయర్‌  రైతులు ఉన్నారు. బ్రాయిలర్‌  రైతులు 6 వేల మంది వరకు ఉన్నారు. దేశంలో 25 కోట్ల  లేయర్ కోళ్ల ఉత్సత్తి ఉంటే... తెలంగాణలోనే 4.25 కోట్లున్నాయి. గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ సెకండ్ ప్లేస్ లో ఉంది. రాష్ట్రంలో నిత్యం 3.2 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. నిత్యం1.8 కోట్ల గుడ్లు వినియోగిస్తున్నారు తెలంగాణ జనం. మిగిలిన 1.4 కోట్ల గుడ్లను పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంది తెలంగాణ. అటు కోడి మాంసం విక్రయంలో కూడా తెలంగాణ ముందే ఉంది. పౌల్ట్రీ రంగం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సుమారు..12,000 కోట్ల ఆదాయం వస్తుంది.

 

తెలంగాణలో లేయర్స్ రైతులు అధికంగా నష్టపోయారు. కోడికి అందించే ఫీడ్ కూడా పొరుగు రాష్ట్రాల నుంచి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపద్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి రావాల్సిన ఫీడ్ నిలిచిపోయింది. ఇక రైతులకు ఇన్నాళ్లు డబ్బులు వెంటనే చెల్లించకపోయినా... ఫీడ్ అందించే వారు. కానీ ఇప్పుడు నెట్ క్యాష్ ఉంటేనే ఫీడ్ అందిస్తున్నారు. ఇక అందిన కాడికి కోడిగుడ్లు చేతికి అందినా... ట్రేడర్స్ సరిగా రేట్లు కట్టించటం లేదు అని రైతులు ఆందోళన చెందుతున్నారు. నెట్ ఒక గుడ్డుకు 3 రూపాయల 40 పైసలు ఉంటే 2 రూపాయల 80 పైసలకు కొంటున్నారు. కానీ మార్కెట్లో మాత్రం 4 రూపాయల 50 పైసల నుంచి 5 రూపాయల వరకు అమ్ముతున్నారు. మామూలుగా ఒక్కో కోడికి 120 గ్రాముల ఫీడ్  వేస్తారు. కానీ 50 గ్రాములతో సరిదిద్దటంతో  గుడ్ల ఉత్పత్తి కూడా సగానికి పడిపోయింది. బ్రాయిలర్ రైతుల ఆదాయం జీరో కి వచ్చేసింది.

 

బ్రాయిలర్స్ తో పోలిస్తే.. లేయర్స్ కు ఎక్కువ ఖర్చవుతుంది.  ఒక్కో లేయర్ ని కనీసం 6 నెలలు పెంచాల్సి ఉంటుంది. ఆరు నెలల్లో ఒక్కో కోడికి అయ్యే ఖర్చు 350 రూపాయలు. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడు ఆ కోడిని కేవలం 40 రూపాయలకే కేజీ అడుగుతున్నారు. సరిపడా ఫీడ్ ఇవ్వకపోవటంతో నష్టం మరింత పెరిగింది. 40 ఏళ్లల్లో ఇలాంటి పరిస్ధితి ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. 

 

సాధారణ రోజుల్లో తెలంగాణలో డైలీ 10 లక్షల కోళ్ల మాంసం అమ్మకాలు జరిగేవి. కానీ ఇప్పుడు 2 నుంచి 3 లక్షల కోళ్ల మాంసం విక్రయాలకు పడిపోయింది. దీంతో సుమారు 6 వేల కోట్లు మేర ఆదాయానికి గండి పడింది. హైదరాబాద్ లో పూర్తిస్ధాయిలో చికెన్ దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. కానీ జిల్లాల్లో మాత్రం అంతంత మాత్రంగానే తెరిచి ఉండటంతో అమ్మకాలు లేకుండా పోయాయి.  కరోనా వ్యాప్తి కంటే ముందే రాష్ట్రంలో చికెన్ వ్యాపారం దెబ్బతింది.  200 పై చిలుకు ఉండే చికెన్ ధర... 70 రూపాయల వరకు పడిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి మారినా.. సాధారణ రోజులతో పోలీస్తే... ఇప్పుడు వ్యాపారం మాత్రం 30 శాతమే జరుగుతోంది. పౌల్ట్రీని నమ్ముకున్న వారందరికి ఇప్పుడు తిప్పలు తప్పటం లేదు. మొత్తానికి కరోనా...తెలంగాణలొ మరో ఆరు నెలల వరకు కోడిని కోలుకోకుండా చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: