లాక్ డౌన్ విషయంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 14వ తేదీతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధన ముగియనున్న నేపథ్యంలో మరికొంత కాలం పొడిగించాలంటూ వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే విజ్ఞప్తులు ప్రధాని నరేంద్ర మోదీకి వస్తున్నాయి. ఈ విషయంలో ఈ రోజు ప్రధాని నిర్ణయాన్ని వెలువరించనున్న నేపథ్యంలో ప్రధాని నిర్ణయంపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో వ్యాధి తీవ్రత ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో మరికొంతకాలం పొడిగించాలంటూ ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు అందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ విషయంలో ఏ  నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనే విషయంపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అందరి అభిప్రాయాలను శ్రద్ధగా విన్నారు. ఇక ఇదే వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా లాక్ డౌన్ విషయంలో తన అభిప్రాయం ఏంటో మోదీకి జగన్ చెప్పారు. కేవలం రెడ్ జోన్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే లాక్ డౌన్ ను పరిమితం చేయాలని, జనం గుంపులుగా సంచరించే షాపింగ్ మాల్, సినిమా హాల్, ప్రార్థన మందిరాలు తదితర చోట్ల నిబంధన కొనసాగించాలని, మిగతా ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించాలని, ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. ఏపీలో 37 మండలాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయని, 44 మండలాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని, 595 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని మోదీకి జగన్ వివరించారు. మీ నాయకత్వంలోనే తాము పనిచేస్తామని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అంగీకరిస్తామని ఈ సందర్భంగా జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీ లో కరోనా వైరస్ విషయంలో తాము తీసుకుంటున్న ప్రాథమిక చర్యలను ప్రధానికి జగన్ వివరించారు.


 కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తున్నామని, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచామని, 4 అత్యాధునిక ఆసుపత్రులను కరోనా చికిత్స నిమిత్తం ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాకు ఒక కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్టు జగన్ వివరించారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పూర్తిగా పడిపోయింది అని, ముఖ్యంగా ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతింటుందని, అలాగే పంపిణీ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిందని, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడిందని, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మీరు తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రధానిని కోరినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: