రోహిణి సింధూరి... తెలుగు వాళ్లకు ఈమె పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ కన్నడిగులకు ఈమె బాగా సుపరిచితం. తెలుగమ్మాయి రోహిణి సింధూరి తన సిన్సియారిటీ వల్ల అనేక సార్లు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయ్యారు. ఎన్నిసార్లు బదిలీ చేసినా రోహిణి తీరు, తెగువలో ఏ మాత్రం మార్పు లేదు. ఆమె ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లా ప్రజలు ఆమె వచ్చాకే తమ జీవితాల్లో మార్పు వచ్చిందని... ఆమెను బదిలీ చేయవద్దని కోరుతున్నారంటే రోహిణి సింధూరి గురించి సులభంగా అర్థమవుతుంది. 
 
దేశంలోని ఐఏఎస్ అధికారుల్లో రోహిణి సింధూరిది ప్రత్యేక ఒరవడి. ప్రతి క్షణం సమాజంలో వెలుగులు నింపేందుకు ఆమె పోరాటం చేస్తూనే ఉంటారు. నాణ్యత లోపించిన రోడ్లు వేస్తున్నారని మంత్రి టెండర్లను రద్దు చేయించడం... ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు మంత్రి కార్యాలయానికి తాళాలు వేయడం... ఇలా చెప్పుకుంటూ పోతే రోహిణి సింధూరి జీవితంలో ఆమె నీతి, నిజాయితీ, ధైర్యం, తెగువకు అద్దం పట్టే ఘటనలు ఎన్నో ఉన్నాయి. 
 
బాల్యం నుంచే కలెక్టర్ కావాలని కలలు గన్న రోహిణి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జాతీయ స్థాయిలో 43వ ర్యాంకు సాధించారు. ఇంజనీరింగ్ తర్వాత సివిల్స్ కోసం ఢిల్లీకి వెళ్లిన రోహిణి రోడ్డు ప్రమాదానికి గురైంది. కొంతకాలం పాటు వీల్ చైర్ కే పరిమితమైనా లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. ఖమ్మం జిల్లాలో పుట్టిన రోహిణి నెల్లూరు జిల్లాకు చెందిన సుధీర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో రైతు కష్టాలను చూసి చలించి కేంద్రం నుంచి కోట్ల రూపాయల నిధులు తెప్పించి రైతులకు రుణం అందేలా చేశారు. 
 
ఆమె డిప్యూటీ కమిషనర్ (కలెక్టర్ హోదా) బాధ్యతలు స్వీకరించాక హసన్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. హసన్ జిల్లాలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా మస్థకాభిషేకం కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. హసన్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి నైపుణ్యత లేని వారికి టెండర్లు ఇవ్వడంతో రోహిణి ఆ కాంట్రాక్టును రద్దు చేశారు. ఆ తర్వాత టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించడంతో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. బదిలీని తప్పు బడుతూ ఆమె న్యాయస్థానం మెట్లు ఎక్కడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. 
 
భర్త ప్రోత్సాహంతో ప్రజాసేవకే అంకితమయ్యనని రోహిణి చెబుతోంది. 2019 సెప్టెంబర్ 24న తప్పు ద్రోవ పడుతున్న నిధులను నిలిపేసి అవినీతి ని ప్రశ్నించిందని కర్ణాటక ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: