గత రెండు రోజుల నుంచి సీఎం జగన్ నివాసం గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ నివాసం హాట్ స్పాట్ లో ఉందంటూ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాడేపల్లికి సమీపంలో ఇటీవల ఒక వృద్ధురాలు మరణించడంతో వైద్యులు ఆమెకు పరీక్షలు జరిపారు. ఆ పరీక్షల్లో వృద్ధురాలికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమె ఇల్లు జగన్ ఇంటికి సమీపంలోనే ఉంది. 
 
అందువల్ల సీఎం నివాసం రెడ్ జోన్ లో ఉందంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై వైసీపీ నేతలు స్పందించకపోవడంతో చాలామంది ఈ వార్తలు నిజమేనని నమ్మారు. వైరల్ అవుతున్న వార్తలు కలెక్టర్ దృష్టికి రావడంతో కలెక్టర్ ఈ విషయం గురించి స్పందించారు. సీఎం జగన్ నివాసం రెడ్ జోన్ లో లేదని కలెక్టర్ శామ్యూల ఆనంద్ స్పష్టం చేశారు. కనీసం నాలుగు కేసులు నమోదైతే మాత్రమే ఆ ప్రాంతాన్ని హాట్ స్పాట్ గా గుర్తిస్తామని కలెక్టర్ చెప్పారు. 
 
ఇప్పటివరకు తాడేపల్లిలో ఒక్క కేసు నమోదైందని... ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని హాట్ స్పాట్ గా గుర్తించలేదని పేర్కొన్నారు. సీఎం జగన్ నివాసం గురించి కలెక్టర్ స్పష్టతనివ్వడంతో వైరల్ అవుతున్న వార్తలు నిజం కాదని తేలింది. మరోవైపు రాష్ట్రంలో ప్రతిరోజూ అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
ఈరోజు ఉదయం వరకు రాష్ట్రంలో 603 కరోనా కేసులు నమోదు కాగా 16 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 42 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 545 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 132 కరోనా కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 125, కృష్ణా జిల్లాలో 70, నెల్లూరు జిల్లాలో 67 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: