భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుంది?. మే 3 తరువాత అలిపిరి మెట్లపై నడక సాగుతుందా? టీటీడీ ఈ విషయంలో ఏం ఆలోచిస్తోంది.? భక్తుల ఎదురుచూపులకు తెరపడేది ఎప్పుడు?

 

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శన భాగ్యం కలిగి భక్తులకు అప్పుడే 40 రోజులు దాటిపోయింది. ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులు ఏకాంతంగా పూజా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ కంటే ముందు నుంచే శ్రీవారి దర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. మార్చి 24 నుంచి అమలులోకి రాగా.. 20 వతేదీ నుంచే దర్శనాలను టీటీడీ నిలిపివేసింది. 19న ఉత్తరప్రదేశ్‌కి చెందిన భక్తుడికి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉండటంతో టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మేరకు దర్శనాలను నిలిపివేసింది. అప్పటి నుంచి లాక్ డౌన్‌కి అనుగుణంగా దర్శనాల నిలిపివేతని పొడిగిస్తూ పోతోంది టీటీడీ.

 

మే 3 తర్వాత లాక్‌డౌన్‌ ముగుస్తుందా.. లేదా అనేది ప్రభుత్వాల నుంచి  క్లారిటీ లేదు. మరోవైపు వైరస్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌పై ప్రభుత్వాలు అయోమయంలో పడ్డాయి. ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికి భక్తులను ఎప్పటి నుంచి అనుమతిస్తారో అనే అంశంపైనా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు ఆలయ అధికారులు. అయితే జూన్ 30 వరకు శ్రీవారి దర్శనానికి అనుమతించరు అంటూ సోషియల్ మీడియాలో జరుగుతన్న ప్రచారాన్ని మాత్రం టీటీడీ ఖండించింది. 

 

మరో వైపు ఇప్పటికే మార్చి 13 నుంచి మే 31 వరకు సేవా టిక్కెట్లను, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసుకున్న భక్తులకు నగదు తిరిగి చెల్లిస్తామని టీటీడీ ప్రకటించింది. లాక్ డౌన్ తరువాత శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించినా.. పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవలసి వుందన్నారు. దీనిపై పాలకమండలి, అధికారులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  

 

 మొత్తంగా వైరస్ తగ్గే వరకు స్వామి వారి దర్శనంపై క్లారిటీ వచ్చే అవకాశాలు కల్పించడం లేదు. దీంతో స్వామి వారి దర్శన భాగ్యం తిరిగి ఎప్పటి నుంచి లభిస్తూందనేదానిపై భక్తులు వేచి చూడక తప్పని పరిస్థితి. 

మరింత సమాచారం తెలుసుకోండి: