ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మహారాష్ట్రను తలచుకొని తెగ తెన్షన్ పడిపోతోంది. ఓ జిల్లాలో కరోనాను అదుపులోకి తెచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలిస్తున్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఉండే మరాఠా గ్రామాలతో తెలంగాణ గ్రామాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. 

 

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్త కేసులు నమోదు కాకపోవడంతో ఆ జిల్లా ఇప్పుడు ఊపిరిపీల్చుకుంటోంది. కరోనా మహమ్మరి నుంచి ఎలాగో గట్టెక్కుతున్నామని  హర్షం వ్యక్తం చేస్తున్న సమయంలో.. మహారాష్ట్ర నుంచి ముప్పు పొంచి ఉందని ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాలు ఆందోళన చెందుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్రలోని నాలుగు జిల్లాలతో సహరిహద్దులు పంచుకున్నాయి. దీంతో అధికారులకు సైతం కంటిమీద కునుకులేకుండా పోతోంది. సరిహద్దుల్లోని చెక్ పోస్ట్ ల వద్ద కట్టుదిట్ట చర్యలకు పూనుకున్నారు. 


 
ముఖ్యంగా మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో దాదాపు వందకు దగ్గరలో కరోనా పాజివ్ కేసులున్నాయి. దీంతో ఈ ప్రాంతం రెడ్ జోన్ లోకి వెళ్లిపోయింది. సాధారణంగా ఈ జిల్లా గ్రామస్థులు ఆదిలాబాద్ జిల్లాలోకి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అంతేకాదు జైనాథ్, బేలా, భీంపూర్ మండలాల్లోని గ్రామాల ప్రజలు.. మరాఠా గ్రామాలతో సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇపుడు అధికారులు రాకపోకలు జరుపకుండా నిబంధనలు విధించారు.  అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తూ.. అనవసరంగా తిరుగుతున్న వాళ్లను వెనక్కి పంపించేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 

 

లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనాల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. అయితే వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో వలస కూలీలు సరిహద్దుల దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా వాసులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. జిల్లా సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర వాసులు తమ జిల్లాలోకి ఎక్కడ ప్రవేశిస్తారో అనే భయం నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: