దేశంలో వేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. దేశంలో ప్రతిరోజు 3000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్రం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. పాఠశాలల్లో సరి బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆలోచిస్తున్నాయి. 
 
పాఠశాలల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశంతో అధికారులు ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు పలు జాగ్రత్తలు తీసుకుంటూ స్కూళ్లను కొనసాగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా అధికారులు పాఠశాలకు 50 శాతం విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సరి బేసి ఆలోచన రావడంతో అధికారులు ఒకరోజు సగం తరగతుల విద్యార్థులు మరోరోజు సగం తరగతుల విద్యార్థులు హాజరయ్యేలా ఆలోచన చేస్తున్నారు. 
 
ఈ నిర్ణయం వల్ల పాఠశాలలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం సాధ్యమవుతుంది. కేంద్రం ఈ నిర్ణయాన్ని మొదట్ సీ.బీ.ఎస్.ఈ, కేంద్రీయ, నవోదయ పాఠశాలల్లో అమలు చేయనుంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇదే నిర్ణయం సూచించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం ఈ విధానంలో ఇంటి దగ్గర ఉండే విద్యార్థులకు సమయం వృథా కాకుండా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో 56,516 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో 1895 మంది కరోనా భారీన పడి మృతి చెందగా 16,867 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినా ఏపీలో వైరస్ విజృంభిస్తోంది. ఏపీలో నిన్నటివరకు 1887 కరోనా కేసులు నమోదు కాగా 41 మంది మృతి చెందారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: