హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ సిటీ బస్సులు లక్షల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నయనే సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో సామాన్యులను నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడంలో సిటీ బస్సులు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇదంతా కరోనా విజృంభణకు ముందు సంగతి. ప్రస్తుతం కరోనా వల్ల ఆ పరిస్థితులు కనిపించడం లేదు. 
 
కరోనా విజృంభణతో తెలంగాణ సర్కార్ సిటీ బస్సులను ఎంపిక చేసిన రూట్లకే పరిమితం చేయాలనుకుంటోంది. 40 నుంచి 50 కి.మీ వరకు ఉండే ప్రధాన రూట్లలోనే నగరంలో సిటీ బస్సులు నడవనున్నాయి. ఫరూఖ్‌నగర్‌ నుంచి పటాన్‌చెరు, సికింద్రాబాద్‌ నుంచి పటాన్‌చెరు, సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట్, హయత్‌నగర్‌ నుంచి బీహెచ్‌ఈఎల్ లాంటి ప్రధాన రూట్లలోనే బస్సులు నడవనున్నాయి. 
 
ప్రయాణికుల రాకపోకలను నియంత్రించేందుకు ప్రవేశ ద్వారాలకు తలుపులు ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. లిమిటెడ్‌ రూట్లు– లిమిటెడ్‌ బస్సులు అనే ప్రతిపాదనతో తొలి దశలో బస్సులు నడపనున్నారు. అధికారులు సిటీలో కండక్టర్‌లెస్‌ సర్వీసులను నడపాలని నిర్ణయం తీసుకున్నారు. బస్టాపుల్లో కండక్టర్ల ద్వారా టికెట్లు విక్రయించాలని అధికారులు యోచిస్తున్నారు. 
 
మాస్కులు ఉన్న వారికే కండక్టర్లు టికెట్లు ఇచ్చేలా అధికారులు నిబంధనల్లో మార్పులు చేస్తున్నారు. డిపోల్లోంచి బయలుదేరే ప్రతి బస్సును పూర్తిగా శానిటైజ్‌ చేసి కరోనా నిబంధనలకు అనుగుణంగా రోడ్డెక్కించినట్టు తెలుస్తోంది. బస్సులు నడపడంతో పాటు ప్రయాణికులు, సిబ్బంది రక్షణ ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,150 రూట్లలో సిటీ బస్సులు తిరుగుతుండగా కేవలం 50 ప్రధాన రూట్లకే మొదట బస్సులను పరిమితం చేయనున్నారని తెలుస్తోంది. తక్కువ దూరం ఉన్న మార్గాల్లో ఎలాంటి సర్వీసులు ఉండవని తెలుస్తోంది. అధికారులు తొలి విడతలో మేడ్చల్‌ – సికింద్రాబాద్, హయత్‌నగర్ ‌– బీహెచ్‌ఈఎల్, ఫరూఖ్‌నగర్‌ – పటాన్‌చెరు రూట్లను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: