ఏపీలో మద్యపాన నిషధం దిశగా జగన్ సర్కారు ఒక్కో అడుగు వేస్తున్న సంగతి తెలిసిందే.ఆయన తన నవరత్నాల్లోనే ఈ అంశం పెట్టారు. రాష్ట్రంలో మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తానని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదట బెల్టుషాపులు ఎత్తేశారు. ఆ తర్వాత షాపు సంఖ్య తగ్గిస్తూ వస్తున్నారు.

 

 

మొన్నటికి మొన్న మద్యం ధరలను విపరీతంగా పెచ్చేశారు. ఏకంగా 75శాతం వరకూ మద్యం ధరలు పెంచడంతో మందుబాబులు గుర్రుగా ఉన్నారు. అంతే కాదు.. జగన్ సర్కారు అందిస్తున్న మద్యం బ్రాండ్లపైనా విమర్శలు ఉన్నాయి. తక్కువ రకం బ్రాండు మాత్రమే అమ్మి మందుబాబుల ఆరోగ్యం పాడు చేస్తున్నారని టీడీపీ కొంత కాలంగా విమర్శిస్తోంది. ఇలాంటి సమయంలో సొంత పార్టీ ఎంపీ ఒకరు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టడం ఆసక్తి రేపుతోంది.

 

 

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఈ విషయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మందు రేట్లు పెంచినందువల్లో... షాపుల సంఖ్య తగ్గించినందువల్లో తాగే వాళ్లు తగ్గుతారని తాను అనుకోవం లేదని కామెంట్ చేశారు. ఆయన ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్లు చేశారు. మందు అలవాటు ఉన్నవారు దాని కోసం ఓ రెండు కిలోమీటర్లు ఎక్కువ దూరం పోవడానికి వెనుకాడరని ఎంపీ కామెంట్ చేశారు.

 

 

మద్యపాన నిషేధం అమలు చేయదలచ్చుకుంటే.. నేరుగా మద్యపాన నిషేధం పెట్టేయాలని.. ఇలా విడతల వారీగా పెట్టడం వల్ల ఫలితం ఉండదని ఎంపీ అంటున్నారు. మద్యం అమ్మడమా.. నిషేధించడమా... ఏదో ఒకటి చేయాలని.. ఓవైపు మద్యం అమ్ముతూనే ఇలా రేట్లు పెంచడం, షాపులు తగ్గించడం వల్ల ఉపయోగం ఉంటుందని తాను వ్యక్తిగతంగా అనుకోవడం లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. మరి పార్టీ లైన్ దాటి ఈ ఎంపీ ఇలా మాట్లాడటం సాహసమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: