నిమ్మగడ్డ రమేశ్ కుమార్, జగన్ సర్కార్ మధ్య వివాదం పతాక స్థాయికి చేరుతోంది. ఈ వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. మొదటిసారి అడ్వకేట్ జనరల్ శ్రీరాం మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, ఆ తరువాత ఏజీ మాట్లాడటాన్ని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు, సీపీఐ తప్పుబట్టటం జరిగింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమిస్తూ జారీ చేసిన సర్క్యులర్ వెనక్కు తీసుకుంది. 
 
నిమ్మగడ్డకు అత్యంత సన్నిహితుడు అని వినిపిస్తున్న ఎన్నికల సంఘం కార్యదర్శి స్థానంలో ప్రభుత్వం వాణీమోహన్ ను నియమించింది. ఈ వివాదం విషయంలో జగన్ సర్కార్ మరింతకు పట్టుదలకు పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించే అవకాశం లేదని అడ్వకేట్ జనరల్ ద్వారా చెప్పించడం.... వెంటనే ఎన్నికల సంఘం కార్యదర్శి ఉత్తర్వులను ఉపసంహరించుకోవడంతో నిమ్మగడ్డపై జగన్ సర్కార్ ఒక విధంగా పై చేయి సాధించింది. 
 
మరోవైపు గత రెండు రోజుల నుంచి నిమ్మగడ్డ పదవి విషయంలో గందరగోళం మాత్రం నెలకొంది. ప్రభుత్వం మరలా ఊత్తర్వులు ఇస్తే మాత్రమే నిమ్మగడ్డ నియామకం జరుగుతుందని అడ్వకేట్ జనరల్ చెప్పారు. వైసీపీ మాత్రం సుప్రీంకు వెళుతున్నామని.... ఎన్నికల కమిషనర్ తనకు తానుగా బాధ్యతలు స్వీకరించడం మాత్రం కుదరదని చెబుతోంది. నిమ్మగడ్డ మాత్రం పాత ఉత్తర్వులు రద్దయ్యాయంటే తాను బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టే అని సన్నిహితుల దగ్గర చెబుతున్నారని తెలుస్తోంది. 
 
అకస్మాత్తుగా జగన్ సర్కార్ ఎన్నికల సంఘం కార్యదర్శిగా వాణీమోహన్ ను నియమించడంతో తమకు అనుకూలమైన వ్యక్తులను జగన్ సర్కార్ నియమించుకుంటోందని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ నిమ్మగడ్డ రమేష్ కు చెక్ పెట్టేందుకు వాణీమోహన్ ను నియమించారనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సంఘం, ప్రభుత్వం రెండూ కూడా రాజ్యంగబద్ధమైనవే. హైకోర్టు నిమ్మగడ్డ తీర్పుపై స్టే ఇస్తుందా...? లేక ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతుందా....? సుప్రీం ఈ కేసు విషయంలో ఎలా వ్యవహరిస్తుంది...? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: