కోర్టులో కాస్త ఎదురుదెబ్బ తగిలింది లేదో అప్పుడే ఏపీ సీఎం జగన్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టేవారు ఎక్కువైపోయారు. ముఖ్యంగా మొన్నటి వరకు జగన్ పరిపాలనను పొగుడుతూ, ప్రశంసలు కురిపించిన వారు సైతం ఇప్పుడు విమర్శలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వైసిపి ప్రభుత్వం పైన, జగన్ పరిపాలనపైన తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రస్తుతం ఏపీ లో బిజెపి వర్చువల్ ర్యాలీ మొదలవడంతో ఏపీ కి సంబంధించిన అనేక విషయాలపై దృష్టి పెట్టాడు. ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన పై బిజెపి వర్చువల్ ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రామ్ మాధవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన, తీసుకున్న చర్యలు, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడు అనే విషయాలపై పొగుడుతూ ప్రసంగాన్ని మొదలు పెట్టిన రామ్ మాధవ్ ఆ తర్వాత జగన్ పరిపాలనపై తీవ్రస్థాయిలో విమర్శించారు. 

 

IHG


మోదీ ప్రభుత్వం అభివృద్ధి మంత్రంతో ముందుకు వెళుతుంటే.. ఏపీలో మాత్రం దానికి విరుద్ధంగా పరిపాలన నడుస్తోంది అని విమర్శించారు. రాజధాని తో మొదలైన రివర్స్, మద్యపానం నిషేధం విషయంలోనూ అదే రివర్స్ అడుగులు పడుతున్నాయన్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు లో 60 సార్లు వ్యతిరేక తీర్పులు వచ్చాయని, దేశంలో ఎక్కడైనా ఈ విధమైన పరిస్థితి తలెత్తిందా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ తీరు కారణంగా ఆదాయం లేకుండా పోయిందని, ఇప్పటికే కేంద్రం కరోనా కు సంబంధించిన నిధులు 11 వేల కోట్లు ఏపీకి ఇచ్చింది అని చెప్పుకొచ్చారు.

 

 ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు బీజేపీతో కలిసి ముందుకు వెళ్లడం ఎందుకు నచ్చలేదో తెలియదని అన్నారు. ఏదో అత్యాస ఉందని, ప్రధాని పదవిపై ఆశ కలిగిందో లేక, రాజకీయ స్వా లాభం కోసం బయటకు వెళ్లిపోయారో అంటూ విమర్శించారు. అకస్మాత్తుగా రామ్ మాధవ్ ఈవిధంగా మాట్లాడటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో ఏడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా జగన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా జగన్ పరిపాలన పై ప్రశంసలు కురిపించారు. 


దీంతో జగన్ దగ్గరయ్యేందుకు రామ్ మాధవ్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఇక ఏపీ బీజేపీ నేతలు ఎప్పటి నుంచో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో బిజెపి నాయకులు విమర్శలు చేస్తుంటే, కేంద్రం జగన్ తో సఖ్యత గా ఉంటుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని గుర్తించిన బిజెపి అధిష్టానం ఇప్పుడు రామ్ మాధవ్ ని రంగంలోకి దించి జగన్ కు బీజేపీ సపోర్ట్ లేదు అనే సంకేతాలు పంపినట్టుగా కనిపిస్తోంది అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: