కరోనా ప్రభావంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు కేవలం రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై బీఏసీలో చర్చ జరిగినప్పుడు ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారట. అసెంబ్లీ సమావేశాలు కేవలం రెండు రోజులే నిర్వహిస్తే అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు సమయం సరిపోదని టీడీపీ భావించింది. .

 

అందుకు అనుగుణంగా ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బిఎసి సమావేశంలో పదిహేను రోజుల సమావేశాలు ఉండాలని ప్రతిపాదించారట. అయితే కరోనా వైరస్‌ ప్రమాదం ఉన్న తరుణంలో రెండు రోజులకు మించి సభ నిర్వహించడం మంచిది కాదని తాము భావిస్తున్నామని సీఎం జగన్ అన్నారట. అయితే టీడీపీ కోరుకుంటే.. పది, పదిహేను రోజులు కాదు.. 40 కాదు, 50 రోజులైనా.. ఎన్ని రోజులైనా అసెంబ్లీ నిర్వహణకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారట.

 

 

ఎందుకంటే.. తాము ఈ ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టామని అవి చెప్పుకునేందుకు తమకూ సమయం లభిస్తుందని అన్నారట. దాదాపు 4 కోట్ల మందికి రూ. 42 వేల కోట్లు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదును బదిలీ చేశామని... అసెంబ్లీ ఎక్కువ రోజులు జరిగితే ప్రభుత్వం తరఫున తాము ఇవన్నీ చెప్పుకోవడానికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికీ వీలవుతుందని సీఎం జగన్ అన్నారట. కానీ.. తమకు ప్రచారం కంటే.. ప్రజల ప్రాణాలే ముఖ్యమని కేవలం రెండు రోజులే నిర్వహించాలని నిర్ణయించినట్టు జగన్ చెప్పారు.

 

 

ఇదే సమయంలో జగన్ ఇంకో ఇంట్రస్టింగ్ కామెంట్ కూడా చేశారట. టీడీపీ కోరితే ఎన్ని రోజులైనా నిర్వహిస్తాం. కానీ వర్చువల్‌ అసెంబ్లీ మాత్రం సాధ్యం కాదు, దీనిపై పార్లమెంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అక్కడి నుంచి ఏం మార్గదర్శకాలు ఉంటాయో కూడా తెలియదు..’ అని సీఎం జగన్ అన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: