విజయనగరం పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే పేరు...పూసపాటి అశోక్ గజపతిరాజు. మొదట జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అశోక్...1978 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి విజయనగరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మీద అభిమానంతో టీడీపీలోకి వచ్చి, 1983, 85, 89, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఇక 2009లో మరోసారి విజయం సాధించిన అశోక్...2014 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా గెలిచి, మోదీ కేబినెట్‌లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత టీడీపీ-బీజేపీ పొత్తు విడిపోయిన నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేసేశారు.

 

ఇక 2019 ఎన్నికల్లో అశోక్ మళ్ళీ విజయనగరం ఎంపీగా పోటీ చేయగా, ఆయన కుమార్తె అతిథి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. అయితే జగన్ గాలిలో ఇద్దరు ఓడిపోయారు. ఓడిపోయాక అశోక్ కాస్త పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉండటం తగ్గించగా, అతిథి మాత్రం నిత్యం విజయనగరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేసుకుంటున్నారు. ఇదే సమయంలో అశోక్ ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి...జగన్ పూసపాటి ఫ్యామిలీకి చెందిన సంచయితని రంగంలోకి దించి, సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌ పదవి ఇచ్చేశారు.

 

అయితే వచ్చే ఎన్నికల్లో కూడా పూసపాటి ఫ్యామిలీకి చెక్ పెట్టాలంటే సంచయితని విజయనగరం అసెంబ్లీ బరిలో దించాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి వయసు మీద పడుతుండటంతో, ఆయన స్థానంలో సంచయితకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని చూస్తున్నారు. ఒకవేళ అదేగనుక జరిగితే నెక్స్ట్ ఎన్నికల్లో సంచయిత-అతిథిలు విజయనగరం బరిలో ఢీకొట్టొచ్చు.

 

కాకపోతే సంచయిత గనుక అసెంబ్లీ బరిలో ఉంటే విజయం అతిథి వైపే ఉంటుందని అంటున్నారు. పూసపాటి ఫ్యామిలీని ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో విజయనగరం ప్రజలు సంచయితపై గుర్రుగా ఉన్నారు. దీంతో అతిథి మీద సంచయిత పోటీ చేస్తే, విజయం మాత్రం అతిథికే దక్కే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: