తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి ఏడాది దాటింది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక చంద్రబాబు పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడుతున్నారు. అయితే ఈ ఏడాది కాలంలో టీడీపీ పెద్దగా పుంజుకున్న దాఖలాలు లేవు. కానీ కొన్ని చోట్ల మాత్రం టీడీపీ స్వతహాగా పుజుకోలేకపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు వల్ల బలం పెంచుకున్నట్లు తెలుస్తోంది. చాలాచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు సరైన పనితీరు కనబర్చకపోవడం వల్ల టీడీపీకి ప్లస్ అవుతుంది.

 

అలా అనంతపురం జిల్లాలోని కొన్ని స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేల వల్ల టీడీపీ బలం పెంచుకుంది. అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 12 స్థానాలు గెలుచుకుంటే, టీడీపీ కేవలం 2 స్థానాల్లో గెలిచింది. అలాగే 2 పార్లమెంట్ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే ఎన్నికలై ఏడాది దాటింది. ఈ ఏడాది కాలంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మంచి పనితీరు కనబరిస్తే, మరికొందరు పనితీరు ఏ మాత్రం బాగోలేదని తెలుస్తోంది.

 

ఎమ్మెల్యేలు ఎక్కువగా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం, నియోజకవర్గాల్లో దందాలు లాంటివి చేయడం వల్ల, వైసీపీ బలం తగ్గిపోతూ వచ్చింది. దీని వల్ల ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు టీడీపీనే బెటర్ అనుకునే స్టేజ్‌లోకి వచ్చినట్లు కనబడుతోంది. పైగా ప్రతిపక్షంలో ఉండి టీడీపీ నేతలు నిరంతరం పోరాటం చేయడం కూడా ప్లస్ అవుతుంది.

 

అనంత జిల్లాలో టీడీపీ ఖాతాలో హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ రెండు చోట్ల టీడీపీ బలంగానే కనిపిస్తోంది. ఇక వైసీపీ ఖాతాలో ఉన్న కదిరి, తాడిపత్రి, మడకశిర, పెనుకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో టీడీపీ బలం పుంజుకుందని తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు అంతగా బాగోకపోవడం వల్ల, టీడీపీకి ప్లస్ అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ నాలుగేళ్లలో వైసీపీ ఎమ్మెల్యేలు మంచిగా పనిచేస్తే టీడీపీకి ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: