ప్రస్తుతం రాజస్థాన్ రాజకీయం ఎన్నో కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సచిన్ పైలెట్ తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడింది. అయితే ఎన్నికల్లో గెలవడానికి ఎంతో కీలకపాత్ర వహించిన సచిన్ పైలెట్ ను కాదని గెహ్లాట్ కి సీఎం పదవి ఇచ్చినప్పటికీ.. సచిన్ పైలెట్ మొదటినుంచి సైలెంట్ గానే ఉన్నారు. కానీ రోజు రోజుకి సచిన్ పైలెట్ ని  పార్టీలో అణగదొక్కేందుకు కుట్రలు  ఎక్కువ అవుతున్నాయని గ్రహించిన సచిన్ పైలెట్ ఏకంగా  పార్టీ పైన తిరుగుబాటు చేశారు. 

 

 ఈ క్రమంలోనే తనతోపాటు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటూ సచిన్ పైలెట్ తెలిపారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడింది. అయితే సచిన్ పైలెట్ తిరుగుబాటుకు కారణం రాహుల్ గాంధీ అన్న టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. రాహుల్ గాంధీతో సమావేశం అవడానికి సచిన్ పైలెట్ ఎన్నోసార్లు అపాయింట్మెంట్ కోరినప్పటికీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. ఇలా పార్టీలో తనకు సముచిత స్థానం లేదని భావించిన సచిన్ పైలెట్ తిరుగుబాటుకు నిర్ణయించారు అంటూ  రాజస్థాన్ రాజకీయాల్లో టాక్  వినిపిస్తోంది, అయితే  ఇటీవలే సచిన్ పైలెట్ ను పార్టీ సిఎల్పీ నేతగా తొలగించడంతో పాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి కూడా  తొలగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

 


 ఈ నేపథ్యంలోనే సచిన్ పైలెట్ తర్వాత అడుగు ఎటువైపు అన్నది ప్రస్తుతం రాజస్థాన్ రాజకీయాల్లో ఎంతో ఆసక్తికరంగా మారింది. సచిన్ పైలెట్ బిజెపి లోకి వస్తే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ బిజెపి నేతలు అంటున్నారు. అదే సమయంలో సచిన్ పైలెట్ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లోకి వస్తారు అని అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో ఏపీలో జగన్ నిర్ణయం తీసుకున్నట్లు గానే యువనేత సచిన్ పైలెట్ కూడా నిర్ణయం తీసుకుంటారని.. జగన్ తరహాలోనే సచిన్ పైలెట్ కూడా కొత్త పార్టీ పెట్టే అవకాశం లేకపోలేదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి సచిన్ పైలెట్ అడుగు ఎటువైపు అన్నది కొన్ని రోజుల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: