దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో అడ్డూఅదుపూ లేకుండా శరవేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దేశంలో నిన్న ఒక్కరోజే దాదాపు 50,000 కేసులు నమోదయ్యాయంటే వైరస్ వ్యాప్తి తీవ్రత సులభంగానే అర్థమవుతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పలు రాష్ట్రాలు సామాజిక వ్యాప్తి మొదలైందని కీలక ప్రకటనలు చేస్తున్నాయి.
అన్ లాక్ 1.0, అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత దేశంలో, తెలుగు రాష్త్రాల్లో కరోనా కేసులు పెరిగాయి. జులైలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఆగస్టులో పరిస్థితులు ఎటు దారితీస్తాయోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. వైరస్ వ్యాప్తి మొదలై ఐదు నెలలు నిండకుండానే కేసుల సంఖ్య తారాస్థాయికి చేరింది. నమోదైన కేసుల పరంగా ఏపీ 5వ స్థానంలో ఉండగా తెలంగాణ 9వ స్థానంలో ఉంది. నగరాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న వైరస్ జిల్లాలకు, గ్రామాలకు వేగంగా వ్యాపిస్తోంది.
మున్ముందు కరోనా వైరస్ ఎంతటి విపత్తుకు దారితీస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆగస్టు రావడానికి ఇంకా వారం రోజులుంది. జులైలోనే ఈ స్థాయిలో కేసులు నమోదవుతుంటే ఆగస్టులో ఏ స్థాయిలో కేసులు నమోదవుతాయో ఊహించే పరిస్థితి కూడా లేదు. ఇదే స్థాయిలో వైరస్ విజృంభిస్తే ఆగస్టులో అల్లకల్లోలమే అని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. ప్రస్తుతం వర్షాకాల సీజన్ నడుస్తోంది.
జలుబు, దగ్గు, జ్వరాలు వర్షాకాలంలో మనుషులను పట్టిపీడిస్తాయి. అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ కూడా కరోనా రెండో దశ ఆగస్టులో ప్రారంభమై, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. వైరస్ రెండో దశలోకి వెళ్లడానికి ముందే నియంత్రిచకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తక్షణం చికిత్స చేయడం ద్వారా కరోనాతో ఇన్‌ఫెక్షన్ రాకుండా రోగిని కాపాడుకోగలిగే పరిస్థితి ఉంటుందని.... కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి