జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పట్టణాలు, నగరాలలోని వ్యవసాయ భూములు, అపార్టుమెంట్లు, ఖాళీ స్థలాల మార్కెట్ విలువలను ప్రభుత్వం ఆగష్టు 1వ తేదీ నుంచి పెంచనుంది. ఆయా ప్రాంతాల డిమాండ్లను బట్టి భూముల విలువలు 5 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో దీనికి సంంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ధరలను ఎంతవరకు పెంచాలన్న అంశం గురించి ఆదేశాలు వెలువడకపోతే స్థానిక సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదించిన ధరలు అమలులోకి వస్తాయని సమాచారం. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గత నాలుగు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. సాధారణంగా మార్కెట్ విలువలను సవరించడానికి రెవెన్యూ, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్, ఆయా ప్రాంతాల అభివృద్ధిని పరిగణననలోకి తీసుకోవాలి.
రియల్ ఎస్టేట్ రంగం బాగా దెబ్బ తినడంతో ప్రభుత్వం మార్కెట్ విలువల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. సాధారణంగా ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను పెంచాలని భావిస్తే ఆ ప్రతిపాదనలను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో ఉంచి ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించిన తరువాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం భూముల విలువలను పెంచే ఉద్దేశంలో ఉండటంతో ఈ ప్రక్రియ జరుగుతుందో లేదో చూడాలి.
ప్రభుత్వం ఇప్పటికే ఆర్‌సీసీ భవనాలు, రేకుల షెడ్లు, పౌల్ట్రీలు ఇలా అన్ని రకాల కట్టుబడి విలువలను సవరించింది. చదరపు అడుగుకు 20 నుంచి 40 రూపాయల వరకు కట్టుబడి విలువలను పెంచింది. గ్రామాల్లో నిర్మాణాల ధరలను రూ. 20 నుంచి రూ. 30 వరకు పెంచిన ప్రభుత్వం పూరి గుడిసెలకు మాత్రం ఎలాంటి పెంపు లేదని పేర్కొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి