క్రికెట్‌కు ఓ అద్భుతమైన కెప్టెన్‌ అందించిన రోజుకు సరిగ్గా 13 ఏళ్లు..! సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు  మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో టీమిండియాకు టీ-20 వరల్డ్‌కప్‌ వచ్చింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. తన సత్తాను ప్రపంచానికి  చాటింది టీమిండియా.

ఫైనల్ పోరులో దాయాది పాకిస్థాన్‌ను ఓడించి పొట్టి ప్రపంచకప్‌ను గెలుచుకుని నేటికి 13 ఏళ్లు పూర్తి అయింది. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఫేవరేట్ ఏమీ కాదు.  దిగ్గజ ఆటగాళ్లు లేనప్పటికీ.. కుర్రాళ్లతోనే ధోనీ అద్భుతాలు సృష్టించాడు.

అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా.. లీగ్‌ దశ దాటితే గొప్ప అని అంతా భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ధోని నాయకత్వంలోని భారత యువజట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడింది. పాక్‌పై గెలిస్తే అభినందనలు.. ఓడితే విమర్శలు రావడం ఖాయం. ఒకవైపు మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో భారం భారత బౌలర్లపై పడింది. పాక్‌ విజయానికి ఆఖరి ఓవర్లో 13 పరుగులు కావాలి. మిస్మా-ఉల్‌-హక్‌ 37 పరుగులతో అప్పటికే క్రీజులో పాతుకుపోయాడు.. టీమిండియా బౌలర్లలో హర్భజన్‌, జోగిందర్‌ శర్మలకు ఒక్కో ఓవర్‌ మిగిలి ఉంది.

ఇక్కడే ధోని కెప్టెన్‌గా తన తెలివిని ప్రదర్శించాడు. ఎందుకంటే అంతకుముందు భజ్జీ వేసిన 17వ ఓవర్ లో మిస్బా మూడు సిక్స్‌లు కొట్టాడు. అందుకే సీనియర్‌ బౌలర్‌ హర్భజన్‌ను కాదని జోగిందర్‌ శర్మకు బంతిని ఇచ్చాడు. జోగి వేసిన మొదటి బంతి వైడ్‌గా వెళ్లింది.. రెండో బంతి డాట్‌ బాల్‌గా పడింది. ఒక మూడో బంతిని మిస్బా షార్ట్‌ ఫైన్‌లైగ్‌ మీదుగా బంతిని గాల్లోకి లేపాడు.. అక్కడున్నవారంతా అది సిక్స్‌ అని భావించారు. కానీ బంతి అనూహ్యంగా శ్రీశాంత్‌ చేతిలో పడింది. ఇంకేముంది... టీమిండియా ఖాతాలో మొదటి టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ పడింది. ఇదే కెప్టెన్‌గా ధోని మొదటి విజయానికి బీజం పడింది. ఆ తర్వాత అంతా చరిత్రే.

మరింత సమాచారం తెలుసుకోండి: