2019 ఎన్నికల్లో టీడీపీ ఏ స్థాయిలో ఘోర ఓటమి పాలైందో తెలిసిన విషయమే. కేవలం 23 సీట్లకు పరిమితమై ప్రతిపక్షంలో కూర్చుంది. మరీ దారుణంగా ఓటమి పాలవ్వడం వల్ల టీడీపీకి అసెంబ్లీలో పెద్ద బలం లేకుండా పోయింది. అయితే ప్రతిపక్షంలో ఉన్నా సరే టీడీపీకి ఊరటనిచ్చిన అంశం ఎమ్మెల్సీల బలం. శాసనమండలిలో వారిదే పైచేయి. అందుకే అసెంబ్లీలో వైసీపీ హవా నడిచిన, మండలిలో టీడీపీ డామినేషన్ కనిపించింది.

దీంతో తమకు నచ్చని బిల్లులని అడ్డుకున్నారు. అందుకే జగన్ కూడా మండలి రద్దు చేయడానికే మొగ్గు చూపారు. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తూ, కేంద్రానికి పంపారు. అయితే టీడీపీకి ఏదైతే బలంగా భావిస్తున్నారో, అదే బలం ఇప్పుడు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు చేజారారు. డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత, శమంతకమణి, శివ నాథ్ రెడ్డి లాంటి వారు టీడీపీని వీడారు.

ఇక తాజాగా పార్టీకి ఎంతో అండగా నిలిచిన ఏ‌ఎస్ రామకృష్ణ సైతం సైడ్ అయిపోయారు. రామకృష్ణ టీడీపీ కోసం బలమైన వాయిస్ వినిపించారు. మీడియా ముందు, మండలిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాడారు. అలాంటి ఎమ్మెల్సీనే చంద్రబాబు పట్టించుకోవడం లేదని తెలిసింది. అందుకే ఆయన త్వరలో జరగబోయే కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. 2015 ఎన్నికల్లో రామకృష్ణ టీడీపీ బలపరిచిన అభ్యర్ధిగా గెలుపొందారు.

కానీ ఇప్పుడు టీడీపీ ఈయన్ని పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అందుకే ఇండిపెండెంట్‌గా బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. అటు పార్వతీపురంకు చెందిన ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ సైతం టీడీపీని వీడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అలాగే శతృచర్ల విజయరామరాజు పార్టీకు దూరంగానే ఉంటున్నారు. దీని బట్టి చూసుకుంటే టీడీపీకి ఒక్కో ఎమ్మెల్సీ చేజారుతున్నట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో టీడీపీకి ఎమ్మెల్సీల బలం మరింత తగ్గేలా ఉంది. బాబు పట్టించుకోకపోతే మరీ ఇబ్బందుల్లో పడటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: