కరోనా వ్యాక్సిన్‌పై సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ పై స్పష్టత రావొచ్చంటున్నారు. అదీ కూడా గ్యారెంటీ లేదు. మూడు నెలలుగా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతున్నామని..కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకురావటం చాలా కష్టమైన వ్యవహరమని చెప్పుకొచ్చారు రాకేశ్‌ మిశ్రా.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతునే ఉంది. దాదాపు 4.85 కోట్ల మంది ప్రజలు మహమ్మారి బారిన పడ్డారు. 12 లక్షల మంది చనిపోయారు. కాని నేటికి కరోనా వ్యాక్సిన్ ఏదీ కూడా ఇంకా విస్తృత వినియోగం కోసం ఆమోదం పొందలేదు.

డబ్ల్యూహెచ్ ఓ ప్రకారం ప్రస్తుతం 34 కంపెనీలు కరోనా వైరస్ వ్యాక్సీన్‌ను తయారుచేస్తున్నాయి. ఇవి క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయి. మరోవైపు మూడు కంపెనీలు  క్లినికల్ ట్రయల్స్ రెండో దశలో ఉన్నాయి. మరో 142 సంస్థలు కూడా ప్రీ క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి.ఆస్ట్రాజెనెకా తయారుచేస్తున్న ఆక్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సీన్ ఈ రేసులో అన్నింటి కంటే ముందుంది. ఇవి కూడా వచ్చే ఏడాది మధ్య నాటికి ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం కొన్ని కరోనా వ్యాక్సీన్‌లు అందుబాటులో రాబోతున్నాయని అయితే ఇవి కోవిడ్-19 నుంచి  పూర్తిగా రక్షణ కల్పించలేవని అంటున్నారు.

ఇక ఈ ఏడాది ఆగస్టు 11న స్పుత్నిక్ వీ పేరుతో తొలి కరోనా వ్యాక్సీన్‌ను తయారుచేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ వ్యాక్సీన్ అద్భుతంగా పనిచేస్తోందని తెలిపింది. అయితే, మూడో దశ క్లినికల్  ట్రయల్స్‌ను ఈ వ్యాక్సీన్ ఇంకా పూర్తిచేయలేదని  విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని సమర్థమంతమైన వ్యాక్సీన్‌గా చెప్పలేమని వివరిస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ రావడానికి కనీసం ఇంకా ఏడాది సమయమైన పడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

మరోవైపు అమెరికాలోని గత మే నెలలో ఎనిమిది మందిపై చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో వైరస్‌ను నిర్వీర్యం చేయగలిగే యాంటీ బాడీలు ఉత్పత్తి అయ్యాయని తేలింది.వైరల్ ప్రొటీన్ల సాయంతో రోగ నిరోధక శక్తిని ప్రేరేపించే దిశగా కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.2021 ఏడాది మధ్యలో విడుదలకు అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే వైరస్‌ పుట్టినప్పటి నుంచి 12-18 నెలల కాలంలో అందుబాటులోకి వస్తుందన్నమాట.అదే జరిగితే అది సైన్సులో అద్భుతమే.వాస్తవానికి కరోనా వ్యాక్సిన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో చెప్పడం చాలా కష్టం. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు, వ్యాక్సిన్లకు రెగ్యులేటరీ ఎప్పుడు ఆమోదిస్తుందో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ వ్యాక్సిన్ అందుబాటులోకి  వచ్చినా దాని ప్రభావం కేవలం ఏడాది వరకు మాత్రమే ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా వ్యాక్సిన్‌ రావడానికి కనీసం ఇంకా ఏడాది సమయమైన పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: