కాలం కలిసి రాకపోతే ఓడలు బళ్లవుతాయని పెద్దలంటారు. కూతురు పెళ్లి కోసం 5 వందల కోట్లు ఖర్చు చేసిన ప్రమోద్‌ మిట్టల్‌... ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదంటూ చేతులెత్తేశాడు. ఈ మధ్యే అనిల్‌ అంబానీ దివాళా తాశారు. ఇప్పుడు అతని సరసన ప్రమోద్‌ మిట్టల్‌ చేరారు. విచిత్రమేమిటంటే... ఓ వైపు వీళ్ల అన్నయ్యల ఆస్తులు అంతకంతకూ పెరుగుతుంటే... వీరిద్దరూ మాత్రం దివాళా తీయడం ఆశ్చర్యపరుస్తోంది.

కాలం చాలా విచిత్రమైనది. ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రమోద్‌ మిట్టల్‌ విషయంలో ఇది మరో సారి రుజువైంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన లక్ష్మీ మిట్టల్‌కు స్వయానా సోదరుడు ప్రమోద్ మిట్టల్. లండన్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయారు. సుమారు 24 వేల కోట్ల రూపాయల అప్పున్నట్టు లండన్ హైకోర్టుకు తెలిపారు ప్రమోద్‌. దీంతో బ్రిటన్‌ చరిత్రలోనే అతిపెద్ద దివాళా కేసుగా రికార్డులు సృష్టించారు.

ప్రమోద్‌ మిట్టల్‌ పతనానికి  కారణం బోస్నియన్‌కు చెందిన ఓ బొగ్గు కంపెనీ. 2006లో బోస్నియన్ కోక్ తయారీ కంపెనీ జికిల్ రుణాలకు తన గ్లోబల్ స్టీల్ హోల్డింగ్ తరఫున హామీ సంతకం పెట్టారు ప్రమోద్‌. అయితే, 166 మిలియన్‌ డాలర్లను తిరిగి చెల్లించడంలో జికిల్‌ విఫలమైంది. దీంతో అప్పు ఇచ్చిన మార్గెట్‌ కంపెనీ... ఆ మొత్తాన్ని ప్రమోద్‌ మిట్టల్‌ నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతో అంత మొత్తాన్ని తాను చెల్లించలేనంటూ దివాళా ప్రకటించారు మిట్టల్‌.  

తనేకు వ్యక్తిగత ఆదాయం లేదని గత ఏడాది లండన్ కోర్టులో చెప్పారు ప్రమోద్ మిట్టల్. తన భార్యకు ఆర్థిక స్వేచ్ఛ ఉందని... తమకు వేర్వేరు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల ఆమె ఆదాయం గురించి తనకు చాలా తక్కువ తెలుసన్నారు ప్రమోద్‌ మిట్టల్‌. 2 వేల నుండి 3 వేల పౌండ్ల తన నెలవారీ ఖర్చులు కూడా భార్య, కుటుంబం సభ్యులే భరిస్తున్నట్టు వివరించారు. దివాలా కేసులో కోర్టు ఖర్చును మూడవ పక్షం భరిస్తోందని కోర్టుకు తెలిపారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు ప్రమోద్‌ మిట్టల్‌. ఈ క్రమంలో 2019లో బోస్నియాలో అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే, భారత్‌లోనూ 2 వేల 200 కోట్ల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడ్డారు ప్రమోద్ మిట్టల్. ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియాను మోసం చేసినందుకు 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే, ఈ మొత్తాన్ని సోదరుడు లక్ష్మీ మిట్టల్‌ చెల్లించడంతో కేసు నుంచి బయటపడ్డారు ప్రమోద్‌.

అనీల్‌ అంబానీ కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఎదుర్కొంటున్నారు. ఇటీవల తన ఆర్థిక పరిస్థితిపై లండన్ కోర్టుకు వివరించారు. ఖర్చులు తగ్గించుకున్నట్టు తెలిపారు అనిల్ అంబానీ. అంతేకాదు... ఓ కేసులో అనిల్‌ అరెస్టు కాకుండా ఉండేందుకు భారీ మొత్తాన్ని చెల్లించారు ముఖేశ్‌ అంబానీ. అంబానీ కుటుంబం లాగే, 1994లో మిట్టల్‌ సోదరులు విడిపోయారు. లక్ష్మి మిట్టల్ ఆర్సెలర్ మిట్టల్‌గా పని కొనసాగించాడు. నేడు ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్‌మేకర్ గా ఆయన ఉన్నారు.  ప్రమోద్ మిట్టల్ సంస్థ గ్లోబల్ స్టీల్ హోల్డింగ్స్ దివాళా తీసింది.





మరింత సమాచారం తెలుసుకోండి: