విజయవాడలో రోజు రోజుకీ వాహనాల రద్దీ పెరిగిపోతోంది. నగరం విస్తరిస్తున్నా ట్రాఫిక్ సమస్య మాత్రం తీరడంలేదు. దీంతో విజయవాడలో మెట్రో రైలు ఏర్పాటు చేస్తామని గతంలో టీడీపీ ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. విభజన చట్టంలోనే మెట్రో రైలు హామీ ఉండటంతో.. కేంద్రం సహాయంతో మెట్రో తీసుకొస్తామని హంగామా చేశారు అప్పటి నాయకులు. రాజధాని ప్రాంతానికి కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్పారు.

చంద్రబాబు ప్రభుత్వం 2015 అక్టోబరు 29 న అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. విజయవాడ, విశాఖ పట్నంలో మెట్రో రైలు మార్గం కోసం ఆ సంస్థ ప్రణాళికలు రూపొందించింది. మొదటగా విజయవాడకోసం రూపొందించిన ప్రాజెక్ట్ ని ఆర్థిక సమస్యల కారణంగా కేంద్రం తిరస్కరించింది. దీంతో అప్పటి చంద్రబాబు సర్కారు లైట్ మెట్రో రైలును ఎంపిక చేసింది. అయితే ఈ లైట్ మెట్రో ప్రాజెక్ట్ ఇష్టంలేక, మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తున్న ఇ.శ్రీధరన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజధాని నగరం అమరావతి అమరావతి అవసరాలను ఇది తీర్చలేదని చెప్పారాయన. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ పూర్తిగా పక్కన పడిపోయింది.

ఇప్పుడు మరోసారి ఏపీలో మెట్రో ప్రతిపాదన పట్టాలెక్కింది. అయితే ఇది విజయవాడలో కాదు, విశాఖలో. మూడు రాజధానులను ప్రకటించిన సీఎం జగన్ విజయవాడను కాదని, విశాఖలో ముందుగా మెట్రో రైలు ప్రాజెక్ట్ ని తెరపైకి తెస్తున్నారు. దీనికి సంబంధించి విశాఖలో మెట్రో కార్పొరేషన్‌ కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ప్రారంభించారు.
విభజన చట్టంలో మెట్రో ప్రాజెక్టు అంశం ఉంది కాబట్టి కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నామని అన్నారాయన. కేంద్రం సహకారం ఉన్నా లేకపోయినా విశాఖకు మెట్రో వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వమే మెట్రో వ్యవస్థను నిర్వహిస్తుందా, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలా అనే విషయంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విశాఖ మెట్రోకు డీపీఆర్ సిద్ధమవుతోందని.. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని బొత్స స్పష్టం చేశారు. విశాఖలో నాలుగు కారిడార్లుగా 75.31 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మిస్తామని చెప్పారు. మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. విశాఖకు అన్నీ బాగానే ఉన్నాయి కానీ, విజయవాడ మెట్రో ఆశలు మాత్రం వైసీపీ నిర్ణయంతో పూర్తిగా ఆవిరయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: