వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి ఈ నెల 6కి మూడేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో నేతలు, కార్యకర్తలు మరో సారి ప్రజల్లోకి వెళ్లే విధంగా వైసీపీ పది రోజుల కార్యాచరణ అమలు చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటిని పద్నాలుగు నెలల కాలంలో పూర్తి చేసిన తీరును వీడియోల రూపంలో గ్రామ గ్రామాన ప్రదర్శించే విధంగా ఈ కార్యాచరణ ప్లాన్ చేశారు. నాటి పాదయాత్రకు సంకేతంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు అందరూ పాదయాత్రలు చేయాలని పార్టీ పిలుపు ఇచ్చింది.
అయితే చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఈ పాదయాత్రలను లైట్ తీసుకున్నారనే కామెంట్స్ వినిపించాయి. కింది స్థాయి నేతలే ఎక్కువగా కనిపించారనే టాక్ వచ్చింది. దీంతో పలు జిల్లాల్లో సీనియర్ నేతలే రంగంలోకి దిగి స్వయంగా పాదయాత్రలు చేపట్టారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమంలో నిర్లక్ష్యంగా ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు సమాచారం.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, వారి నుంచి అభిప్రాయాలు సేకరించటం, ఇంకా ఏమైనా సమస్యలుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కూడా ఈ కార్యక్రమంలో భాగం. ఈ మొత్తం కార్యక్రమంలో పని చేసింది ఎవరు, లైట్ తీసుకున్నది ఎవరు అనే అంశంపై పార్టీ పెద్దలు దృష్టి సారించినట్లు సమాచారం. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పది రోజుల ప్రజా చైతన్య యాత్రలు విజయవంతంగా ముగిశాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి