ఇంటర్నెట్ డెస్క్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీనీ నటులు మధ్య పోరు
మొదలైంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ ఎన్నికలను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడాన్ని తప్పుబడుతూ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు.
`పవన్ కల్యాణ్ ఓ ఊసరవెల్లి` అని, అతడు ఓ మాటపై ఉండడని, రాజకీయాలంటే సినిమాలు చేసుకుంటూ ఎన్నికలప్పుడు ప్రజల్లో కనిపించడం కాదని విమర్శించారు. అయితే ఇప్పడు ప్రకాష్ రాజ్‌కు మెగా బ్రదర్ నాగబాబు
స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘నీ చరిత్రేంటో నాకు తెలుసు’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికోసం ఓ భారీ లేఖనే ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
`రాజకీయల్లో నిర్ణయాలు ఎన్నోసార్లు మారుతుంటాయి. ఆ నిర్ణయాల వెనుక లాంగ్ టర్మ్‌లో ప్రజలకు, పార్టీకి ఉపయోగపడే ఉద్దేశ్యమే ఉంటుంది. మా నాయకుడు పవన్ కల్యాణ్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుక
విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని మా నమ్మకం. పవన్ కల్యాణ్ ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు.
ప్రకాష్ రాజ్.. నీ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్‌లోనే అర్థం
అయ్యింది. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక
తడబడటం నాకు ఇంకా గుర్తుంది. బీజేపీ తీసుకునే నిర్ణయాలు నీకు నచ్చకపోతే
విమర్శించు తప్పులేదు. అలాగే బీజేపీ గాని, మరే పార్టీ గాని మంచి చేస్తే
ప్రశంసించాలి. అంతేకానీ విమర్శించడమే పనిగా పెట్టుకోకూడదు. మంచి చేస్తే
మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం.
ఒకటి మాత్రం చెప్పగలను. ఈ దేశానికి బీజేపీతో.. ఆంధ్రప్రదేశ్‌కి జనసేన
పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహనా మేధావులు ఎన్నిసార్లు
అనవసరపు కామెంట్లు చేసినా బీజేపీ, జనసేన కూటమి శక్తిని ఆపలేరు. అయినా నీ చరిత్రేంటో నాకు తెలుసు. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస
పెట్టావో, డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఏ స్థాయిలో నష్టాలకు గురిచేశావో
అన్నీ గుర్తున్నాయి. ముందు నువ్వు మంచి మనిషిగా మారు. ఆ తర్వాత ఇతరులపై వేలెత్తి చూపించు. డైరెక్టర్స్‌ని కాకా పట్టి నిర్మాతలను కాల్చుకు తినే
నీకు ఇంత కంటే మంచిగా మాట్లాడడం ఏలా తెలుస్తుంది. బీజేపీ నేతల్ని నువ్వు
ఎన్ని మాటల అన్నా వాళ్లు నిన్ను ఏమీ అనడం లేదంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకో. మీడియా అడిగింది కదాని ఒళ్లు పొంగి నీ పనికి మాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట పెట్టుకోకు` అంటూ
నాగబాబు ఘాటుగా రిప్లై ఇచ్చారు.
నాగబాబు ఈ స్థాయిలో కౌంటర్ ఇస్తారని జనసేన అభిమానులు కూడా ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు. మరి దీనిపై ప్రకాశ్ రాజ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి