అమరావతి ఉద్యమకారులు ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. సీఎం జగన్ మూడు రాజధానుల గురించి అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత డిసెంబర్ 17న అమరావతి ప్రాంత వాసులు ఉద్యమం మొదలు పెట్టారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని, మూడు రాజధానులు వద్దని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పడంతో అమరావతి రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. ఎక్కడికక్కడ నిరసన శిబిరాలు ఏర్పాటు చేసుకుని, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. చూస్తుండగానే ఈ ఆందోళనలు మొదలు పెట్టి ఏడాది కావస్తోంది. డిసెంబర్ 17తో అమరావతి ఆందోళనలు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు రైతులు.

అమరావతి కోసం ప్రభుత్వంతో సాగిస్తున్న పోరులో విజయం సాధించి తీరుతామని రాజధాని రైతులు విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమం చేపట్టి డిసెంబరు 17 నాటికి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా గుంటూరులో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి మహా పాదయాత్ర చేపట్టింది. శుభం కల్యాణ మండపం నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు జరిగిన ఈ పాదయాత్రలో మహిళలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ, వామపక్ష నేతలు రైతులకు సంఘీభావం తెలిపారు.

అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు జేఏసీ నాయకులు గద్దె తిరుపతిరావు తెలిపారు. 14న తుళ్లూరులో కిసాన్‌ సమ్మేళనం, 15న విజయవాడలో పాదయాత్ర, 17న ఉద్దండరాయునిపాలెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అమరావతికి మద్దతుగా చేపట్టిన కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్త మద్దతుకోసం రైతులు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా రాయలసీమ నుంచి వారు మద్దతు ఆశిస్తున్నారు. రాయలసీమకు కేవలం హైకోర్టుని తరలించడం మినహా ఏమీ చేయడంలేదని అంటున్న జేఏసీ నేతలు, అమరావతికి మద్దతు తెలిపాలని, రాయలసీమ ప్రాంత వాసుల్ని కోరుతున్నారు. మొత్తమ్మీద నిరసనలు మొదలై ఏడాది కావొస్తున్న సందర్భంగా.. సీఎం జగన్ తో తాడో పేడో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నారు రైతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: