ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రిస్తితి అత్యంత ద‌య‌నీయంగా ఉన్న విష‌యం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం.. ఏపీ ప్ర‌జ‌లు వ‌ద్ద‌న్నా.. తెలంగాణ ప్ర‌జ‌ల త్యాగాల‌ను గుర్తించి.. రాష్ట్రం ఏర్పాటు చేశాం.. అని చెప్పుకొనే కాంగ్రెస్‌కు అదే రాష్ట్రంలో ఎదుర‌వుతున్న ప‌రాభ‌వాలు అన్నీ ఇన్నీకావు. 2014 ఎన్నిక‌ల్లో, 2018 ఎన్నిక‌ల్లోనూ .. పార్టీ ఓట‌మిపాల‌వ‌డమే కాకుండా.. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన నాయ‌కులు .. పార్టీ మారిపోయి.. టీఆర్ ఎస్‌లో చేరిపోయినా.. చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. ఇక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో మ‌రీ ఘోరంగా కాంగ్రెస్ ప‌రిస్థితి త‌యారైంది. దీంతో కాంగ్రెస్‌ను న‌డిపించే వారు కూడా కాన‌రాక ఇబ్బందులు ప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ కొంచెం ఆలోచ‌న చేస్తే.. కీల‌క‌మైన నాయ‌కుడిగా.. ప్ర‌జా నేత‌గా, ద‌ళిత వ‌ర్గాల ఆశాజ్యోతిగా ఉన్న వికారా బాద్ మాజీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి డాక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ క‌నిపిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉండ‌డ‌మే కాకుండా.. తెలంగాణ ఉద్య‌మంలోనూ కీల‌క పాత్ర‌పోషించారు చంద్ర‌శేఖ‌ర్‌. అంతేకాదు.. ద‌ళితుడిని ముఖ్య‌మంత్రి చేస్తాన‌న్న కేసీఆర్ వ్యూహం వెనుక కీల‌క నేత‌గా ఉన్న‌ది కూడా చంద్ర‌శేఖ‌రే. వివాద ర‌హితుడు, సౌమ్యుడు, విద్యావంతుడు, అనేక స‌మయాల్లో రాజ‌కీయంగా త‌న ప్ర‌తిభ‌ను చాటుకుని.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించారు చంద్ర‌శేఖ‌ర్‌.

ఇలాంటి కీల‌క‌మైన నాయ‌కుడు .. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి.. కేవ‌లం 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇలాంటి నాయ‌కుడికి క‌నుక అవ‌కాశం ఇస్తే.. అన్ని విధాలా పార్టీ అభివృద్ధి చెందేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం రాష్ట్రంపై గుత్తాధిప‌త్యంతో ముందుకు సాగుతున్న టీఆర్ ఎస్‌కు అడ్డుక‌ట్ట వేయాలంటే.. ఆ పార్టీ మూలాల‌ను తెలిసిన చంద్ర‌శేఖ‌ర్ లాంటి వ్య‌క్తుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న చ‌ర్చ తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోంది.

అదేవిధంగా కేసీఆర్‌ను బ‌లంగా ఢీకొనేందుకు ఆయ‌న ఏదైతే.. ద‌ళిత సీఎం హామీ ఇచ్చారో.. అదే నాయ‌కుడుగా చంద్ర‌శేఖ‌ర్ ఆయ‌న‌కు చుక్క‌లు చూపించే అవ‌కాశం కూడా ఉంటుంది. ఇక‌, ద‌ళిత ఓటు బ్యాంకు స‌హా మేధావులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి, విద్యావంతులను కూడా కాంగ్రెస్ వైపు మ‌ళ్లించే శ‌క్తి సామ‌ర్థ్యాలు చంద్ర‌శేఖ‌ర్‌కు ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. కాబ‌ట్టి.. కాంగ్రెస్ ఆదిశ‌గా ఆలోచ‌న చేయ‌డం వ‌ల్ల పార్టీకి భారీ బ్రేక్ రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: