తెలంగాణతో పాటు.. పంజాబ్, మద్యప్రదేశ్... గుజరాత్ రాష్ట్రాలకు కూడా పీసీసీ చీఫ్‌లను నియమించాల్సి ఉంది. ఏఐసీసీ కార్యాలయానికి 23 నుంచి క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. సెలవుల్లోపే నాలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ అధ్యక్షుల్ని  ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల పార్టీ అసంతృప్త నేతలతో సమావేశమైన తర్వాత.. పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలని సోనియా నిర్ణయించారు. ఇందులో బాగంగా నాలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల్ని ఫైనల్ చేశారు. ఈ నెల 23న ప్రకటించకపోతే క్రిస్మస్ తర్వాతైనా ప్రకటన రావడం ఖాయం అంటున్నాయి ఏఐసీసీ వర్గాలు.

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. పార్టీలో కొంతమంది రేవంత్‌ రెడ్డికి మద్దతుగా నిలిస్తే.. సీనియర్లు మాత్రం వద్దని తెగేసి చెప్పారు. రేవంత్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలిస్తే పార్టీలో ఉండలేమని అధిష్టానానికి సంకేతాలు పంపారు. అయితే ఇప్పుడన్న పరిస్ధితిలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే... పార్టీకి మరింత నష్టం కలిగే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు హైకమాండ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ నేతల అభిప్రాయాలతో ఠాగూర్ ఇచ్చిన నివేదిక రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంది.

సీనియర్ల కోణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క అయితే అనే కోణంలోనూ చర్చ జరిగింది. ఫైనల్ జాబితాకు వచ్చే సరికి భట్టి విక్రమార్క వైపే మొగ్గినట్లు తెలుస్తోంది. రెడ్డియేతర వర్గానికి ఇవ్వాల్సి వస్తే... అనే కోణంలో భట్టి పేరు సీరియస్ గానే ఢిల్లీలో పరిశీలనలో ఉంది. భట్టి విక్రమార్క కూడా పార్టీ నాయకత్వం బాధ్యతల కోసం సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీలో ఓ సీనియర్ నేత, ఎఐసీసీ కార్యదర్శి హోదాలో ఉన్నమరో నాయకుడు కూడా భట్టి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒకటీ రెండు రోజుల్లో అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఫైనల్ చేయబోతుంది. మాస్‌ ఫాలోయింగ్‌తో పాటు పార్టీలో అందర్నీ కలుపుకుపోయే వ్యక్తి ఎవరనే కోణంలోనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉండబోతోంది. 2023 ఎన్నికలే లక్ష్యం అని చెబుతున్న ఏఐసీసీ ఆ లక్ష్యాన్ని సాధించే బాధ్యత ఎవరికి అప్పగిస్తుందనేది ఆసక్తికరం.

మరింత సమాచారం తెలుసుకోండి: