నాలుగు నెలలుగా జనాలు లేక బోసిపోయిన రిజిస్ట్రార్ ఆఫీసులు ఇప్పుడు క్రయవిక్రయలతో కళకళలాడుతున్నాయి. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదు కానీ వ్యవసాయేతర భూములు మాత్రం జోరుగా రిజిస్ట్రేషన్లవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 14 నుంచి ధరణి పోర్టల్ ప్రారంభించినా.. టెక్నికల్ సమస్యలతో మళ్లీ పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ అవసరంలేదని ప్రభుత్వం చెప్పడంతో.. ఆ ప్లాట్ల అమ్మకాలు జోరందుకున్నాయి.
డిసెంబర్ 21 నుంచి జనవరి మొదటి వారంవరకు రాష్ట్రవ్యాప్తంగా 53వేల 180 రిజిస్ట్రేషన్లు జరిగాయి. దాదాపు 500 కోట్ల వరకు సర్కార్ ఖజానాకు అదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్న జిల్లాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలు చివరి స్థానంలో ఉన్నాయి. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మూడో ప్లేస్ లో వుంది. డిసెంబర్ 20 నుంచి జనవరి 1 వరకు రంగారెడ్డి జిల్లాలో 15వేల 520 డాక్యూమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తే.. 213 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12వేల 755 డాక్యూమెంట్ల రిజిస్ట్రేషన్ చేయగా.. 143 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. హైద్రాబాద్‌లో 3వేల 693 డాక్యూమెంట్లకు గాను 75 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అయితే హైద్రాబాద్ లో బీఆర్ఎస్, మ్యూటేషన్ లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఒక్క రోజులోనే వందల రిజిస్ట్రేషన్లు చేస్తుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి