ఈరోజుల్లో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే తప్ప ఇల్లు సజావుగా సాగని పరిస్థితి నెలకొంది. అందుకే సాధ్యమైనంత వరకూ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చేసి ఇంటికి సాయపడాలన్న అభిప్రాయం మహిళల్లో పెరుగుతోంది. అది ఓ అవసరం గా మారింది. అయితే ఆ అవసరాన్ని కూడా కొందరు కామాంధులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు.

ఆడవాళ్ల ఉద్యోగ అవసరాన్ని గుర్తించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. చివరకు తమ కోరిక తీరిస్తేనే మీకు ఉద్యోగం ఉంటుందని తమ కింద పని చేసే ఆడవారిని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేసి వారి కోరికలు తీర్చుకుంటున్నారు కొందరు నీచులు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు లోనూ అలాంటి బాగోతమే ఒకటి బయటపడింది. శంషాబాద్‌ విమానాశ్రయంలోని ఎజైల్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌లోని మహిళా ఉద్యోగులను సంస్థ అడ్మిన్‌ ఇలాగే వేధిస్తున్నాడట.

ఆ వేధింపులు తట్టుకోలేక శంషాబాద్‌ విమానాశ్రయంలోని ఎజైల్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌లోని మహిళా ఉద్యోగుల ఆందోళనకు దిగారు. సంస్థ అడ్మిన్‌ శ్రీకాంత్‌  తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. తనతో గడిపితేనే ఉద్యోగాలు ఉంటాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు.

సంస్థలో  ఐదారేళ్లుగా పని చేస్తున్న వారి వద్ద అడ్మిన్‌ శ్రీకాంత్ డబ్బు కూడా తీసుకునే వాడట. డబ్బులు అడిగితే నువ్వు డ్యూటీ ఎలా చేస్తావో చూస్తా.. పోలీస్‌ స్టేషన్‌కి రా అని బెదిరించేవాడట. అంతే కాదు.. ఆయనతో గడపాలట.. లేదంటే డ్యూటీ చేయొద్దట. తన కోరిక తీర్చకపోతే డ్యూటీలు మార్చి సతాయిస్తాడట.. అందుకే టార్చర్‌ పెట్టి క్లీనింగ్‌లో అక్కడా ఇక్కడా వేస్తున్నాడని అని ఓ మహిళా ఉద్యోగి కన్నీటి పర్యంతం అయ్యారు. చివరకు ఎజైల్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ అడ్మిన్ శ్రీకాంత్‌ ఆగడాలపై ఎనిమిది మంది బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: