గాల్వాన్‌ ఘటనలపై తొలిసారి నోరు విప్పింది చైనా. ఆనాటి ఘర్షణల్లో తమ ఐదుగురు మిలటరీ ఆఫీసర్లు, సైనికులు చనిపోయినట్లు ప్రకటించింది. అంతేకాదు భారత సైన్యంపై దాడిని సమర్థించుకుంది. ఇనుప రాడ్లు, మేకులు ఉన్న రాడ్లు, రాళ్లతో సౌర్వభౌమాధికారాన్ని రక్షించారంది డ్రాగన్ కంట్రీ.

పరోక్షంగా భారత్‌ను ఉద్దేశిస్తూ కామెంట్లు చేసింది గ్లోబల్ టైమ్స్‌. ఏప్రిల్ నుంచీ విదేశీ శక్తులు పాత ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని, బ్రిడ్జీలు, రోడ్డు నిర్మాణాల పేరుతో సరిహద్దు దాటారంటూ రాసుకొచ్చింది.
విదేశీ శక్తులు యధాతథ స్థితిలో మార్పు తెచ్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నించారని, అందుకే ఉద్రిక్తతలు పెరిగాయని ఆరోపించింది. ఒప్పందాలను గౌరవిస్తూ తాము చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నించామంటూ...శాంతి ప్రవచనాలు వల్లించింది.

షిన్‌జియాంగ్‌ మిలిటరీ కమాండర్‌ కీ ఫబావోతోపాటు, చెన్‌ హోంగ్జన్‌, చెన్‌ షియాన్‌గ్రాంగ్‌, షియాలో సియువాన్‌, వాంగ్‌ జురాన్‌ మృతిచెందినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ తెల్పింది. మృతులకు గౌరవ హోదాలు కల్పించినట్లు ప్రకటించింది. హోదాలు కల్పిస్తూ సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్‌తో జరిగిన ఘర్షణలో ఆర్మీని ముందుండి నడిపించిన కల్నల్‌కు సముచిత గౌరవం కల్పించినట్లు చైనా ప్రకటించింది.

గ్లోబల్‌ టైమ్స్‌కు ముందు చైనా ఆర్మీ అధికారిక పత్రిక పీఎల్ఏ డెయిలీ కథనాన్ని ప్రచురించింది. కారాకోరమ్ పర్వతాల్లో చైనా సైన్యంలోని ఐదుగురు అధికారులు, సైనికులను చైనా సెంట్రల్ మిలిట్రీ కమిషన్ గుర్తించిందని వారిని తగిన పదవులతో సత్కరిస్తామని పీఎల్ఏ డెయిలీ శుక్రవారం తన రిపోర్ట్‌లో చెప్పింది. చైనా ఆర్మీ మొదటిసారి గల్వాన్ ఘర్షణ గురించి వివరణాత్మక కథనం ఇచ్చింది. భారత సైన్యం అక్కడికి పెద్ద సంఖ్యలో సైనికులను పంపించిందని, వారంతా అక్కడ దాక్కొని ఉండి, చైనా సైన్యం వెనక్కు వెళ్లేలా బలవంతం చేశారు అని కథనం రాసింది.

ఆనాటి ఘర్షణల్లో తమ తప్పేమి లేదన్నట్లు చెప్పుకొచ్చింది చైనా. భారత్‌ వల్లే ఘర్షణలు జరిగాయని చెప్పే ప్రయత్నం చేసింది. ఘర్షణలు జరిగిన 10 నెలల తర్వాత తొలిసారి స్పందించిన డ్రాగన్‌ కంట్రీ... మొక్కుబడిగా ఐదుగురి పేర్లను మాత్రమే ప్రకటించింది. చనిపోయిన మిగితా సైనికుల వివరాలను రహస్యంగా ఉంచింది. ఐతే...భారత సైన్యంపై ఇనుప, ముళ్ల తీగలు చుట్టిన రాడ్లతో చేసిన దాడిని సైతం సమర్థించుకుంది. తమ దేశ సౌర్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకే అలా చేశారంటూ గొప్పలు చెప్పుకుంది చైనా.  

మరింత సమాచారం తెలుసుకోండి: