ఏపీలో కొద్ది రోజుల వ‌ర‌కు వ‌రుస‌గా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంతో ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు తేడా లేకుండా ఎక్క‌డ చూసినా రాజ‌కీయ వేడి కొన‌సాగింది. దాదాపు రెండు నెల‌ల పాటు ఉన్న ఈ పొలిటిక‌ల్ సంద‌డి అలా స‌ద్దుమ‌ణిగిందో లేదో వెంట‌నే తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ రిలీజ్ చేయ‌డంతో మ‌ళ్లీ ఏపీలో అంద‌రి దృష్టి తిరుప‌తిపై ప‌డింది. ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కావ‌డంతో స‌హ‌జంగానే ఇక్క‌డ పొలిటిక‌ల్ అటెన్ష‌న్ ఉంటుంది. స‌రే వైసీపీకి ఎడ్జ్ ఉంటుంద‌న్న ముంద‌స్తు అంచ‌నాలు ఎలా ?  ఉన్నా టీడీపీ నుంచి పోటీ అయితే ఉంటుంద‌నేది వాస్త‌వం.

ఇక నోటిఫికేష‌న్‌తో పాటు నామినేష‌న్ల దాఖ‌లు చేయాల్సి ఉండ‌డంతో ప్ర‌ధాన పార్టీల్లో పొలిటిక‌ల్ కాక మామూలుగా లేదు. ఇక అన్ని పార్టీల‌కు చెందిన అగ్ర‌నేత‌లు సైతం తిరుప‌తిలోనే మ‌కాం వేయ‌డంతో ఒక్క‌సారిగా తిరుప‌తిలో స్థానిక‌, పుర‌పాల‌క సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు మించిన హీట్ అయితే మొద‌లైంది. టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తోన్న కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసేందుకు  టీడీపీలో కొంద‌రు ఎమ్మెల్యేల‌తో పాటు మాజీ మంత్రులు, రాష్ట్ర స్థాయి నేత‌లు ఇక్క‌డే మ‌కాం వేయ‌నున్నారు. పార్టీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అయితే కొద్ది రోజులుగా ఇక్క‌డే మ‌కాం వేయ‌డంతో పాటు ఉప ఎన్నిక కోసం టీడీపీ ఏకంగా ఓ సెంట‌ర్‌ను కూడా ఏర్పాటు చేసింది.

ఇటు వైసీపీ ఈ ఎన్నిక‌ను గెల‌వ‌డ‌మే కాదు... 3 ల‌క్ష‌ల పై చిలుకు మెజార్టీ సాధించాల‌ని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం జ‌గ‌న్ పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి ఒక్కో మంత్రికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఓవ‌రాల్‌గా ఉప ఎన్నిక బాధ్య‌త‌ను మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి అప్ప‌గించారు. వైసీపీలో ఎంత ధీమా ఉన్నా అనుకున్న స్థాయిలో మెజార్టీ రాక‌పోతే మైన‌స్సే అవుతుంద‌న్న లెక్క‌ల్లో వారు ఉన్నారు. వైసీపీకి ఎంత అధికార బ‌లం ఉన్నా.. సొంత పార్టీ నేత‌ల మ‌ధ్య గ్రూపుల గోల ఇబ్బందిగా మారింది. వైవి. సుబ్బారెడ్డికి ఇక్క‌డ స‌మ‌న్వ‌య బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఇక బీజేపీ నేతలు కూడా తిరుపతిలోనే క్యాంపువేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆధ్వర్యంలో కీల‌క నేత‌లు స‌మావేశాలు పెడుతున్నారు. వాకాటి నారాయణరెడ్డి, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి లాంటి వాళ్లు ఇక్క‌డ పార్టీ కోసం ప‌ని చేస్తున్నా.. ఇంకా అభ్య‌ర్థి ఖ‌రారు కాక‌పోవ‌డంతో పాటు వీరిని స్థానికంగా ప‌ట్టించుకునే వాళ్లు లేక‌పోవ‌డం మాత్రం బీజేపీకి దెబ్బ అయ్యింది. జాతీయ నాయ‌కుల‌ను ఇక్క‌డ‌కు ప్ర‌చారానికి తీసుకు వ‌స్తే బీజేపీకి ఊపు వ‌స్తుంద‌న్న ఆశ‌ల‌తో ఈ పార్టీ నేత‌లు ఉన్నారు. ఏదేమైనా తిరుప‌తిలో స‌మ్మ‌ర్ వేడి క‌న్నా మాత్రం రాజ‌కీయ వేడి రాజుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: