సాక్షాత్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పవన్ కల్యాణ్ సీఎం అవుతారని క్రెడిట్ ఇచ్చారని, ఇక పవన్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడమే తరువాయి అని సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. మరికొంతమంది బీజేజీ నాయకులు కూడా పవన్ మాత్రమే సీఎం పోస్ట్ కి అర్హుడంటూ వత్తాసు పలికారు. కానీ తిరుపతిలో అసలా ఊసే లేదు. తిరుపతి ప్రచారానికి పవన్ ని తీసుకొచ్చేందుకు కాస్త ఆవేశపడిన బీజేపీ నాయకులు ఆ తర్వాత తీరిగ్గా నాలుక కరచుకున్నారు. ఇప్పటినుంచే పవన్ కి లేనిపోని బిల్డప్ ఇవ్వడం ఎందుకని సైలెంట్ అయ్యారు. అదే నిజమైతే తిరుపతి బహిరంగ సభలో అందరి ముందు ఆ మాట బయటకు రావాల్సింది. కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు. పవన్ సీఎం, పవన్ సీఎం అన్న బీజేపీ నేతలు.. తిరుపతిలో సైలెంట్ గా ఉన్నారంటే దానికి కారణం వారికి మాత్రమే తెలుసు.

 

పవన్ కల్యాణ్ కి సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయా, లేవా అనే విషయాల్ని కాసేపు పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఏపీలో ఆ స్థాయిలో రాజకీయ శూన్యత ఉందా అనే విషయం తేలాల్సి ఉంది. వైసీపీ ఘన మెజార్టీతో అధికారంలో ఉంది. నవరత్నాల పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారనే ప్రచారమూ ఉంది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ విజయం క్లారిటీగా ఉంది. అటు ప్రతిపక్షం ఎన్నికలకు వెనకడుగేసి అస్త్ర సన్యాసం చేసింది. ఈ దశలో ఏపీలో అసలు సిసలు ప్రతిపక్షం మేనేనంటూ బీజేపీ, జనసేన చెబితే.. ప్రజలు నమ్మే అవకాశం ఉంది. కానీ పవన్ సీఎం అవుతారు, 2024లో అది సాథ్యం, అదే తథ్యం అని చెబుతూ వస్తే జనాలు నమ్మే పరిస్థితి ఉందా. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెలిచి, అది కూడా నిలుపుకోలేకపోయిన జనసేన.. మరో మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఏకంగా సీఎం కుర్చీ సాధిస్తుందా అనేది అనుమానమే.

బీజేపీ అండదందలు ఉండొచ్చు, ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు. కానీ రాష్ట్ర రాజకీయాలు వేరు. పశ్చిమబెంగాల్ లో సైతం రెండేళ్ల ముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యథిక లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. రెండేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో చెమటోడుస్తోంది. ఏపీలో బీజేపీ, జనసేన కూటమికి అధికారం అనేది తీసిపారేయాల్సిన విషయం కాదు కానీ, అది సుదూర స్వప్నమే. ఆ దిశగా కనీసం స్థానిక ఎన్నికల్లో అయినా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారనుకోవాలి. ఒక్క మున్సిపాల్టీ కూడా గెలవకుండా.. వచ్చే దఫా సీఎం సీటు మాదేనంటే ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి?

ఇలాంటి టైమ్ లో పవన్ సీఎం, పవనే సీఎం అభ్యర్థి అంటూ బీజేపీ నేతలు చెబుతున్న మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి. తిరుపతిలో జనసేన ఓట్లకోసం, ఆ పార్టీ మద్దతుకోసం బీజేపీ నేతలు పవన్ ని ఆకాశానికెత్తేస్తున్నారా..? లేక నిజంగానే పవన్ అంటే బీజేపీ నేతలకు కూడా అంత అభిమానం ఉందా..? రాబోయే రోజుల్లో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: