కరోనా వైరస్ నుంచి తమని తాము రక్షించుకునేందుకు ప్రజలు రకరకాల ఆహార పదార్థాలను పుచ్చుకుంటున్నారు. రోగనిరోధక శక్తి పెంపొందించుకునేందుకు తాజా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, తదితర పోషకపదార్థాలను తినడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఐతే కరోనా బారిన పడకుండా ఉండాలంటే మిరియాలు, అల్లం, తేనె మిశ్రమం ప్రతిరోజు తీసుకోవాలని.. ముక్కులో నిమ్మరసం పిండు కోవాలని.. తాటికల్లు/మద్యం లేదా గోమూత్రం నిద్ర లేవగానే తాగాలని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు హల్ చల్ చేస్తున్నాయి. వైద్య నిపుణులు మాత్రం సోషల్ మీడియాలోని ప్రచారాలను అస్సలు నమ్మొద్దు అని సూచిస్తున్నారు. ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తి పెంచడానికి దోహద పడతాయి కానీ కరోనా సంక్రమించకుండా కాపాడతాయనేది అవాస్తవమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే ఆవు పేడ ఒంటినిండా రాసుకుంటే కరోనా వైరస్ అస్సలు దరిచేరదని మరొక ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఐతే కరోనా సంక్రమించడం దేవుడెరుగు కానీ ఆవు పేడ వలన బ్లాక్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌(మ్యూకోర్‌మైకోసిస్‌) వచ్చే ప్రమాదం ఉందని గుజరాతి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆవు పేడ శరీరానికి రాసుకోవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు సోకుతాయని.. ప్రాణాంతకమైన బ్లాక్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు గోశాలల వద్ద క్యూ కడుతూ ఆవుపేడ ఒంటినిండా పూసుకుంటున్నారు. ఆ తర్వాత తమ శరీరాన్ని పాలు, మజ్జిగతో కడుగుతున్నారు. పేడ రాసుకోవడం వల్ల తమకు రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరిగి కరోనా వైరస్ సంక్రమించదని వారు విశ్వసిస్తున్నారు.

ఐతే ఆవుపేడ రోగనిరోధక శక్తిని పెంచుతుందని.. వైరస్ రాకుండా రక్షిస్తుందని ఇప్పటివరకు ఎలాంటి పరిశోధనలో తేలలేదని.. ఆవు పేడ సమర్థవంతమైనదని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ కుమార్ చెప్పారు.

"ఆవు పేడ అనేది కేవలం ఒక జంతువు మలవిసర్జన మాత్రమే. ఆవు పేడ, ఆవు మూత్రం రోగనిరోధక శక్తి పెంచుతాయనేది పూర్తిగా అవాస్తవం. గోమూత్రం, పేడ కరోనా వైరస్ నుంచి అసలు కాపాడలేవు. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి తప్ప ప్రజలు ఇలాంటివి నమ్మకూడదు. ఆవు పేడలో చాలా రకాల ఫంగస్ ఉంటుంది. ఆ ఫంగస్ శరీరంలోకి చొచ్చుకుపోయి అనేక రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీసే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు ఇప్పటికైనా అసత్య ప్రచారాలను నమ్మకుండా జాగ్రత్త పడాలి" అని సీనియర్ డాక్టర్ మోనా దేశాయ్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: