ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీలు గ్యాప్ లేకుండా ప్రతిరోజూ విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి. అదే సమయంలో ఏపీలో ఉన్న మిగతా ప్రతిపక్షాలు కూడా వైసీపీ టార్గెట్‌గానే ఎక్కువ విమర్శలు చేస్తాయి. అది కూడా కొన్ని పార్టీలు టీడీపీ లైన్‌లోనే విమర్శలు చేస్తున్నట్లు కనబడతాయి.
టీడీపీ తర్వాత ఏపీలో కాస్త బలంగా ఉన్న జనసేన అప్పుడప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. ఇక బీజేపీలో కొందరు నాయకులు జగన్‌ని తిడితే మరికొందరు చంద్రబాబుని తిడతారు. అటు సిపిఎం సైలెంట్‌గా ఉంటుంది. ఇక సిపిఐ పక్కగా టీడీపీకి తోక పార్టీలాగానే నడుచుకుంటుంది. ఏపీలో కొనఊపిరితో కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు లైన్‌లోనే నడుస్తున్నట్లు కనిపిస్తుంది.
రాష్ట్ర విభజన ముందు వరకు ఏపీలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్...విభజన జరిగాక అడ్రెస్ లేకుండా పోయింది. అసలు పార్టీ తరుపున నాయకులే లేకుండా పోయారు. చాలామంది వైసీపీ, టీడీపీల్లోకి వెళ్ళిపోయారు. అయితే మిగిలినవారు కాంగ్రెస్ పార్టీలో అలా అలా బండి లాగిస్తున్నారు. ఆ నాయకులు ఇప్పుడు జగన్ టార్గెట్‌గానే రాజకీయం చేస్తున్నారు. బాబుకు పరోక్షంగా మద్ధతుగా ఉంటూ జగన్‌ని నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడైతే తెలంగాణలో టీడీపీ-కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకున్నాయో అప్పటినుంచి వారి దోస్తీ కొనసాగుతుంది.
ఏపీలో పరోక్షంగా టీడీపీకి కాంగ్రెస్ మద్ధతు ఇస్తుంది. పైగా నెక్స్ట్ బాబు అధికారంలోకి వస్తే తమకు ఏమన్నా బెన్‌ఫిట్ ఉండొచ్చని రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఇప్పటినుంచే కాంగ్రెస్ నాయకులు జగన్‌పై విరుచుకుపడుతూనే ఉన్నారు. మీడియా సమావేశాల్లో, టీవీ డిబేట్లలో కాంగ్రెస్ నాయకులు కేవలం జగన్‌ని టార్గెట్ చేసుకునే మాట్లాడుతున్నారు. కొందరు నాయకులు అయితే పక్కాగా టీడీపీ నాయకులు మాదిరిగా మాట్లాడుతున్నారు. ఇక వారినే టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేస్తుంది. మొత్తానికైతే సైకిల్‌కు కొందరు నాయకులు అభయ హస్తం అందిస్తున్నారనే చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి