రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి మరీ ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఏపీలో కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది. అసలు రాష్ట్ర విభజన జరగగానే అంటే 2014 ఎన్నికల ముందు చాలామంది నాయకులు టీడీపీ, వైసీపీల్లోకి వెళ్ళిపోయారు. అయితే కొందరు నాయకులు మాత్రం 2014 ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయారు. ఇక పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్ కష్టమని చెప్పి, 2019 ఎన్నికల ముందు కొందరు నాయకులు వైసీపీ, టీడీపీల్లోకి జంప్ కొట్టేశారు.
అయితే వైసీపీలోకి వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు పరిస్తితి బాగానే ఉంది. పలువురు వైసీపీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. అలాగే కొందరు మంత్రులుగా సెటిల్ అయ్యారు. కానీ టీడీపీలోకి వెళ్ళిన హస్తం నేతల పరిస్థితే ఘోరంగా ఉంది. టీడీపీలోకి వచ్చి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన హస్తం నేతలు ఘోరంగా ఓడిపోయారు. అలా ఓడిపోయిన మాజీ హస్తం నేతలు, టీడీపీలో యాక్టివ్‌గా లేకుండా పోయారు.
భవిష్యత్‌లో టీడీపీలో ఉంటారో లేదో తెలియడం లేదు. అలా 2019 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి పోటీ చేసి ఓడిపోయి అడ్రెస్ లేని నాయకుల్లో మాజీ మంత్రులు కొండ్రు మురళి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మాజీ ఎంపీలు కిషోర్ చంద్రదేవ్, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిలు ఉన్నారు. గత ఎన్నికల్లో కొండ్రు, రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక మళ్ళీ పార్టీలో కనిపించలేదు.
అటు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కనిగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ముక్కు పార్టీలో యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఇక కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్, అరకు పార్లమెంట్ స్థానంలో టీడీపీ తరుపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయాక రాష్ట్ర రాజకీయాల్లోనే కనిపించడం లేదు. అటు కోట్ల సూర్యపకాశ్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఈయన కూడా పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. మొత్తానికైతే మాజీ హస్తం నేతలు సైకిల్ తొక్కలేకపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి