కరోనా అనేది అంతుచిక్కని సమస్యగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన కేసీఆర్.. ఏ వేవ్ ఎప్పుడు ఎందుకు వస్తుందో... ఏ మేరకు విస్తరిస్తుందో తెలియడం లేదనేశారు. అసలు కారణం తెలిస్తేనే నివారణకు మార్గం సుగమం అవుతుందంటున్న కేసీఆర్.. క్లారిటీ రావడం లేదన్నారు. అయినా సరే కరోనాపై పోరాడుతున్న అధికారులు, సిబ్బంది పనితీరును అభినందించారు. ఔషధాల లభ్యత, పడకలు, ఆక్సిజన్ అందుబాటు తదితర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ, వైద్య, ఆరోగ్య పరిస్థితులపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి, ఆయా జిల్లాల్లో పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలను సీఎం సమీక్షించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పారిశుద్ధ్య పరిస్థితుల్లో గుణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని.. తద్వారా కరోనాను కూడా కట్టడి చేయగలిగామని అన్నారు.
కరోనా కట్టడిలో విజయవంతమైన ఫీవర్ సర్వేను మరోసారి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరో జ్వర సర్వే చేయాలన్నారు. కరోనా కట్టడి కోసం ప్రజలు ప్రభుత్వంతో కలిసి రావాలని ముఖ్యమంత్రి అన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని.. స్వీయనియంత్రణ, కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కరోనా ముప్పు తొలగలేదని, నియంత్రణ చాలా సంక్లిష్టంగా మారిన తరుణంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి