మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన గతంలో  ప్రభుత్వంతో చర్చలకు హాజరైన అక్టోబర్‌ 14వ తేదీనే మరణించడం విశేషం.  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆర్కే ఈ చర్చలకు హాజరై.. ఈ నెల 14కి  17 ఏళ్లు అవుతుంది. అలా ఆయన చర్చలు జరిపిన అక్టోబర్ 14నే ఆర్కే మరణించడం యాదృశ్చికం కావచ్చు.


అప్పట్లో జరిగిన చర్చల వివరాలు చూస్తే.. 2004 లో అప్పటి ఉమ్మడి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం జరిపిన చర్చలకు  ఏపీ రాష్ట్ర కమిటీ ప్రతినిధిగా రామకృష్ణ అలియాస్ ఆర్కే  హాజరయ్యారు. 2004 అక్టోబరు 15 , 16 , 17 తేదీల్లో ప్రభుత్వం  మావోయిస్టులతో చర్చలు జరిపింది. 2004 సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీపుల్స్ వార్ కు మూడు రాష్ట్ర కమిటీలు ఉన్నాయి.  ఈ మూడు కమిటీల తరపున మావోయిస్టులు చర్చలకు హాజరయ్యారు. ఉత్తర తెలంగాణ తరపున గాజర్ల రవి అలియాస్ గణేష్ చర్చలకు వచ్చారు..


ఇక ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన ఏవోబీ తరపున సుధాకర్ చర్చలకు వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపున రామకృష్ణ చర్చలకు వచ్చారు. మరో మావోయిస్టు గ్రూపు జనశక్తి తరపున రియాజ్ చర్చలకు  వచ్చారు. అప్పట్లో మావోయిస్టులతో ప్రభుత్వం జరిపిన ఆ చర్చలు సంచలనం సృష్టించాయి. ఎప్పుడూ అడవుల్లోనే ఉండే అన్నలు.. ఒక్కసారిగా జనం మధ్యలోకి రావడం.. అందులోనూ హైదరాబాద్‌ వంటి మహా నగరంలో 3,4 రోజులు గడపడం ప్రజల్లో బాగా చర్చనీయాంశమైంది.


ఇక చర్చల కోసం నక్సలైట్లు గుత్తికొండ బిలం నుంచి బయటకు వచ్చారు. అక్కడ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. హైదరాబాద్‌లో మావోయిస్టులకు  మంజీర అతిథి గృహంలో  ఆతిథ్యం ఇచ్చారు. ఇక చర్చలు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగాయి. మూడు రోజులకుపైగా జరిగిన ఈ చర్చలు విఫలం అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

rk