ఆర్కుట్ వంటి తొలితరం సోషల్ మీడియా మాధ్యమాన్ని తలదన్ని ఫేస్‌బుక్ దూసుకుపోయింది. ఇప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్ లేని నెటిజన్ చాలా అరుదు. అలాగే ఫేస్‌బుక్ అన్నపేరు కూడా చాలాపాపులర్. మరి అలాంటి ఫేస్‌బుక్ పేరు ఎందుకు మారుస్తున్నారు.. ఇలా మార్చడం వల్ల ఉపయోగం ఏంటి అన్న అనుమానాలు కలగక మానవు. ఇకపై ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు మెటా మాతృసంస్థగా ఉంటుందని జుకర్ బర్గ్ తెలిపారు. ఫేస్‌బుక్ కొత్త పేరు మెటా అని ప్రకటించిన జుకర్ బర్గ్.. తర్వాత తరం సోషల్ మీడియా మెటావర్స్‌ను అందించేందుకు ఈ మెటా సాయపడుతుందని ఆయన వివరించారు.
ఫేస్‌బుక్ పేరు మార్పుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జుకర్‌బర్గ్ కొన్నాళ్లుగా మెటావర్స్ టెక్నాలజీపై దృష్టి పెట్టారని... ఈ దిశగా ఇప్పటికే వేల మందిని నియమించుకున్నారని తెలుస్తోంది. అలాగే కొన్నాళ్లుగా ఫేస్‌బుక్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫేస్‌బుక్ యూజర్ డేటాను ట్రాక్ చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఫేస్‌బుక్ పై లీగల్ కేసులు వస్తున్నాయి. వీటని ఎదుర్కోవడంలోనూ చిక్కులు ఎదురవుతున్నాయి.
అందుకే న్యాయపరమైన వెసులు బాటు కోసం కూడా ఫేస్‌బుక్ పేరు మారుస్తున్నారన్న వాదన ఉంది. అంతే కాకుండా ఫేస్‌బుక్‌కి చెందిన అన్ని కంపెనీలను ఒకే కొత్త కంపెనీ కిందకు తీసుకురావాలని ఇటీవల జుకర్ బర్గ్ ఆలోచిస్తున్నారు. అందుకే ఈ మెటా ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఫేస్‌బుక్ మెటాగా మారినా ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రాం, మెసేంజర్, వాట్సాప్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని జుకర్‌బర్గ్ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి