ఏపీలో ఇప్పుడు పెట్రో మంటలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్ రాజకీయం భగభగమంటోంది. ఇటీవల పెట్రోల్ ధరలపై  పన్నులు తగ్గించిన కేంద్రం.. రాష్ట్రాలను కూడా అదే పని చేయమని ఉచిత సలహా ఇచ్చింది. అంతే కాదు.. తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాష్ట్రాల పన్నులను కూడా తగ్గించింది. దీంతో ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోలు ధరలు పది రూపాయల వరకూ తగ్గాయి. డీజిల్ దాదాపు 15 రూపాయల వరకూ తగ్గింది. ఈ నేపథ్యంలో బీజేపీయేత పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. పెట్రో పన్నులు తగ్గించుకోవాలని రాష్ట్రాలపై ఒత్తిడి వస్తోంది.


ఇన్నాళ్లూ రోజూ 30 పైసలు, 40 పైసలు చొప్పున పెంచుతూ పెట్రోల్ ధరలను సెంచరీ దాటించిన బీజేపీ ఇప్పుడు తాను అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆందోళనకు దిగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు పెట్రో పన్నులు తగ్గించాలంటూ ఆ పార్టీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు ప్రధాన ప్రతిపక్షం కూడా ఈ పెట్రో పన్నుల తగ్గింపు అంశంపై విమర్శలు గుప్పిస్తోంది. గతంలో జగన్ పాదయాత్రలో చేసిన పెట్రో ధరల ప్రసంగాన్ని ప్లే చేస్తూ మరీ.. చంద్రబాబు జగన్ ను నిలదీశారు.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతావ్ జగన్ అని మండిపడుతున్నారు.


అయితే.. జగన్ సర్కారు మాత్రం రాష్ట్రం పెట్రో పన్నులు తగ్గించుకునేది లేదని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ప్రధాన పత్రికల్లో ఫ్రంట్‌ పేజీ యాడ్‌ ఇచ్చి మరీ ఎదురు దాడి చేస్తోంది. బీజేపీ, టీడీపీ  స్వరూపాన్ని నేరుగా ప్రజలకే వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అసలు పెంచింది.. ఎంత.. ఇప్పుడు తగ్గించింది ఎంత అంటూ లెక్కలేసి మరీ వివరణ ఇస్తూ ఫుల్ పేజ్ యాడ్‌తో కుమ్మేసింది. ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో గణనీయంగా తగ్గినప్పటికీ మోడీ సర్కారు ధరలు తగ్గించలేదని విమర్శించింది.


అంతర్జాతీయ ధరలను అనుగుణంగా కేంద్రం దేశీయ మార్కెట్‌లో ధరలు తగ్గించలేదంటున్న జగన్ సర్కార్..  2019 మేలో లీటరు పెట్రోలు రూ.76.89, డీజిలు రూ.71.50 ఉండగా, ఈ సంవత్సరం నవంబర్‌ 1న పెట్రోలు రూ.115.99, డీజిలు రూ.108.66కు ధరలు పెరిగిందని గుర్తు చేస్తున్నారు. ఇంత బారీగా ధరలు పెంచేసి ఇప్పుడు ఐదో , పదో తగ్గించేసి మేం తగ్గించాం అని గొప్పలు చెప్పుకుంటారా అని నిలదీసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: