బద్వేల్ ఉప ఎన్నిక.... ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం నింపింది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. దాదాపు 90 వేలు పై చిలుకు మెజార్టీ. ఈ మోజార్టీ సామాన్యంగా వచ్చేది కాదు.  ముఖ్య మంత్రి నిర్దేశించిన లక్ష్యం - లక్ష ఓట్ల మోజార్జీకి చేరువ కాలేదని పార్టీ లోని కొందరు శ్రేణులు మదన పడ్డా...  వైఎస్ ఆర్ సిపి అభ్యర్థికి లభించిన ఓట్లు  చూసి రాజకీయ పరిశీలకు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఉత్సాహం పార్టీలో, పార్టీ శ్రేణుల్లో ఎన్నాళ్లుంటుందనే ప్రధాన ప్రశ్న. ఈ ఉప ఎన్నిక  విజయం ముందస్తు ఎన్నికలకు బాటలు వేస్తుందా ? అన్నది సందేహాస్పదమే.
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థలు, పరిషత్ ఎన్నికల్లో భారీ విజయాలను నమోదు చేసుకున్న అధికార పార్టీ వైెస్ ఆర్ సిపి ఇటీవలి కాలంలో రెండు ప్రధాన ఉప ఎన్నికలను ఎదుర్కోంది. అవి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక, కడప జిల్లా బద్వేల్ శాసన సభ ఉప ఎన్నిక. ఈ రెండు ఎన్నికలలోను  వైఎస్ ఆర్ సిపి భారి విజయాన్ని నమోదు చేసుకుంది.  ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల బట్టి చూస్తే ఈ  గెలుపు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నట్లు చెప్పకనే చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో  అర్హులైన ఓటర్ల సంఖ్య, పోలైన ఓట్లు, వివిధ పార్టీలకు లభించిన ఓట్ల శాతం ఇత్యాది విషయాలు పరిశీలిస్తే  రాష్ట్రంలో అధికారంలోఉన్న వైఎస్ ఆర్ సిపికి  ఇంకా ప్రజాదరణ తగ్గలేదన్నది సుస్పష్టం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక లో గురుమూర్తి విజయానికి, బద్వేల్  శాసన సభా స్థానంలో డాక్టర్ సుధ విజయానికి చాలా తేడా ఉంది. ఒకటి పార్లమెంట్ ఎన్నిక కాగా, మరొకటి అసెంబ్లీ ఎన్నిక, సహజంగా ఓటర్లు అసెంబ్లి ఎన్నిక లవైపే మొగ్గు చూపుతారు.  ఇది సంవత్సరాలుగా చరిత్ర చెబుతున్న సత్యం. ఎందుకంటే  తమ ప్రాంత అభివృద్ధి అంతా ఎమ్మెల్యేల చేతుల్లో నే ఉంటుందనేది ప్రజల భావన. బద్వేల్ ఉప ఎన్నికల్లో డాక్టర్ సుధ విజయం తీసుకు వచ్చిన ఉత్సాహం మరికొంత కాలం కొనసాగిస్తే...ఆపై ముందస్తు ఎన్నికలకు వెళితే,  గతంలో లభించిన భారీ విజయాన్ని తరిగి నిలబెట్టుకోవచ్చని కొందరు  నేతలు భావిస్తున్నారు. కానీ ఈ ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేయలేదు కదా ? ఈ ఉప ఎన్నిక  విజయాన్ని సోపానంగా తీసుకుని ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ? అన్నది మరికొందరు సీనియర్ నేతల మనోగతం. అయితే ఎంత సీనియర్ నేతలకయినా  తమ మాట బైటికి చెప్పుకో లేని నిస్సహాయత. ఉప ఎన్నిక ఉత్సాహం ఎన్నాళ్లుంటుంది ? కాలమే సమాధానం చెప్పాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: