భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఒక్క మహారాష్ట్రలోనే 8కేసులు వచ్చాయి. ఈ ఉదయం ఢిల్లీలో నాలుగు, రాజస్థాన్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఒక్కరోజే దేశంలో 16ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు పెరిగింది. ఇప్పటి వరకు 6 రాష్ట్రాలు, 2కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

మరోవైపు గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా కరోనా కేసులు 5వేల 784 నమోదయ్యాయి. మరోవైపు 252మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు 4లక్షల 75వేల 888కి చేరాయి. ఇక తాజాగా కొవిడ్ నుంచి 7వేల 995మంది రికవరీ అయ్యారు. అయితే ప్రస్తుతం దేశంలో 88వేల 993 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 133.8కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన.. 21లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనీ.. 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలనీ.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని హరీశ్ సూచించారు.

మరోవైపు ఏపీలో గత 24గంటల్లో 29వేల 228కరోనా టెస్టులు చేయగా.. 132 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 20లక్షల 75వేల 108కు చేరగా.. ఇప్పటి వరకు 14వేల 468మంది చనిపోయారు. గత 24గంటల్లో 186మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,823 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కేసులు.. అటు ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే.




మరింత సమాచారం తెలుసుకోండి: