ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ తీవ్రంగా వణికిస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు దీనిపై ఎంతమేరకు ప్రభావం చూపిస్తాయనే అంశంపై స్పష్టత లేదు. ఈ క్రమంలో రష్యా కీలక ప్రకటన చేసింది. కరోనాకు మొట్టమొదటి వ్యాక్సిన్ అంటూ.. మహమ్మారి వచ్చిన ఆరంభంలో తాము అభివృద్ధి చేసిన స్ఫుత్నిక్-వి వ్యాక్సిన్ ఈ నయా వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ప్రకటించింది. ఇక మన దేశంలో చాలా మంది ఈ వ్యాక్సిన్ వేసుకున్నారు.

మరోవైపు దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ల కోసం కేంద్రం.. ఇప్పటి వరకూ 19వేల 675కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కేవలం ఇప్పటి వరకూ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 147కోట్ల 73లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందించింది. రాష్ట్రాల దగ్గర ఇంకా 16కోట్ల 66లక్షల డోసులు నిల్వ ఉన్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా భారత్ లో ఇప్పటి వరకు 136కోట్ల డోసులు వేశారు.

ఇక మన దేశంలో ఒమిక్రాన్ ప్రవేశించిన వేళ.. స్కూళ్లు మళ్లీ మూతపడతాయా..? అనే అనుమానాలు తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. అయితే ఒమిక్రాన్ గురించి అనవసర భయాలు పెట్టుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికైతే పిల్లలను స్కూళ్లకు పంపే విషయంలో అనుమానించాల్సిన పనిలేదన్నారు. వారు మాస్కు ధరించేలా చూడటం ముఖ్యమన్నారు. ఒమిక్రాన్ పాజిటివిటీ రేటు పెరిగిన పక్షంలో ప్రభుత్వాలే స్కూళ్ల నిర్వహణ గురించి చర్యలు తీసుకుంటాయన్నారు.

మరోవైపు హైదరాబాద్ టోలీచౌకీకి చెందిన ఇద్దరు వ్యక్తులకు నిన్న ఒమిక్రాన్ సోకినట్టు తేలడంతో వైద్యఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బాధితులు ఉంటున్న అపార్ట్ మెంట్లలోని అన్ని ఫ్లాట్లతో పాటు చుట్టుపక్కల వారి శాంపిళ్లను సేకరించి ఆర్టీపీసీఆర్ టెస్టులకు పంపారు. కాలనీ మొత్తం శానిటైజేషన్ చేశారు. వారు రెండు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లినట్టు గుర్తించారు. వారితో కాంటాక్ట్ అయిన వారు హోం ఐసోలేషన్ కు వెళ్లిపోవాలని సూచించారు. ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి: